రూ.5 కోసం కండక్టర్‌‌ను కొట్టిన ఎన్‌‌సీసీ క్యాడెట్

రూ.5 కోసం కండక్టర్‌‌ను కొట్టిన ఎన్‌‌సీసీ క్యాడెట్

టిక్కెట్ పైసలు ఇవ్వమన్నందుకు ఓ ప్రయాణికుడు కండక్టర్‌‌పై దాడికి దిగి.. ఇష్టమొచ్చినట్లు కొట్టాడు. ఓ వ్యక్తి అడ్డుకొనేందుకు ప్రయత్నించినా అతను వినిపించుకోలేదు. భోపాల్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ ఎన్ సీసీ క్యాడెట్ పోలీస్ హెడ్ క్వార్టర్ కు వెళ్లడానికి బస్టాప్ వద్ద నిలుచున్నాడు. అక్కడకు వచ్చిన బస్సులో ఎక్కాడు. రూ. 15 ఇవ్వాలని కండక్టర్ అడిగాడు. కానీ రూ. 10 ఇస్తానని ఎన్ సీసీ క్యాడెట్ చెప్పాడు. రూ. 5 కోసం ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో.. ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఎన్ సీసీ క్యాడెట్.. కండక్టర్ పై దాడి చేశాడు. విచక్షణారహితంగా కొట్టాడు. ఈ హఠాత్ పరిణామంతో తోటి ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. కొంతసేపటి తర్వాత బస్టాపు రావడంతో ఎన్ సీసీ క్యాడెట్ పరుపరుగున దిగిపోయాడు. ఇతడిని పట్టుకోవడానికి కండక్టర్ ప్రయత్నించాడు. బస్సులో ఉన్న సీసీ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఫుటేజిని కండక్టర్ పోలీసులకు అప్పగించాడు. జహంగీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో NCC క్యాడెట్‌పై ఐపీసీ సెక్షన్ 323 కింద FIR నమోదైంది.