హైదరాబాద్​లోనే ఇల్లు కొనగలం

హైదరాబాద్​లోనే ఇల్లు కొనగలం

మిగతా సిటీల్లో మహా ఖరీదు ..

హైదరాబాద్, వెలుగు: రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ అన్ని సెగ్మెంట్లలో దూసుకుపోతోంది. రెసిడెన్షియల్ మొదలుకుని కమర్షియల్, ఓపెన్ ప్లాట్ల అమ్మకాల్లో ముందు వరుసలో ఉంది. ఎక్కువ ల్యాండ్ బ్యాంక్, ఆఫర్డబుల్ రేట్లు, మెరుగైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్​తో పాటు ఇతర సిటీల్లో రియల్ మాంద్యం కారణంగా భాగ్యనగరం వైపు పెట్టుబడులు తరలివస్తున్నాయి. దీంతో బెంగళూరు, పుణె లాంటి మెట్రో సిటీలకు గట్టిపోటీనిస్తూ మన సిటీ టాప్ లోకి వచ్చింది. డిమాండ్, సప్లయ్, ప్రైస్ తో పోలిస్తే రాబోయే రోజూల్లోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్ కొనసాగుతుందని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

రియల్ ఎస్టేట్ గ్రోత్ కు కారణాలు…

2014లో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కొత్త గవర్నమెంట్ అధికారంలోకి రావడంతో రాజకీయంగా, ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడింది. దీనికి తోడు ఐటీ బూమ్ బాగా కలిసొచ్చింది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెరగడంతో భూములకు డిమాండ్ పెరిగింది. ఓపెన్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులతో పాటు ఆఫీస్ స్పేస్ వైపు డెవలపర్లు దృష్టి పెట్టారు. ఐటీ సెక్టార్ లో హైదరాబాద్ టాప్ గ్లోబల్ సెంటర్ గా మారింది. మైక్రో సాఫ్ట్, గూగుల్ నుంచి అమెజాన్ వంటి విదేశీ దిగ్గజ సంస్థలు సిటీ నుంచి కార్యకలాపాలు మొదలుపెట్టాయి. దీంతోపాటు మెరుగైన రవాణా వ్యవస్థ, సిటీ చుట్టూ 158కి.మీ పరిధిలో విస్తరించిన ఔటర్ రింగురోడ్డు, ఏ కొస నుంచైనా సిటీ మొత్తం తిరిగేందుకు అవకాశం ఉన్న మెట్రోతో పాటు, మాస్ ట్రాన్స్ పోర్టు సిస్టం మెరుగ్గా పనిచేస్తుండటం కూడా రియల్ రంగం అభివృద్ధి చెందడానికి కారణమయ్యాయి.

అఫర్డబుల్ రేట్లు

కమర్షియల్, ఐటీ హబ్స్ ఎక్స్ పాన్షన్ తో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది. ఉద్యోగ అవకాశాలు కూడా పెరిగాయి. దీంతో రెసిడెన్షియల్ సెగ్మెంట్ ఊహించని విధంగా అభివృద్ధి చెందుతోంది. పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ ప్రాజెక్టులు రావడంతో పెట్టుబడులు కూడా పెరిగాయి. సిటీలో ముఖ్యమైన ప్రాంతాల్లో అన్ని అమెనిటీస్ తో అఫర్డబుల్ రేట్లలో  ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. మిగతా మెట్రో సిటీల్లో అయితే ఇళ్ల  రేట్లు ఆకాశన్నంటుతున్నాయి. హైదరాబాద్ లో రూ.30 లక్షల నుంచి రెసిడెన్షియల్ ప్రాజెక్టులు లభ్యమవుతున్న క్రమంలో… తక్కువ నిర్వహణ, ఇతర నగరాల కంటే తక్కువైన లివింగ్ కాస్ట్ , పెరుగుతున్న ఉపాధి అవకాశాలతో చిరు ఉద్యోగులు కూడా సొంతింటి కలను నెరవేర్చుకోగలిగే అవకాశం ఉంది.

టాప్ కంపెనీల ప్రాజెక్టులు

సిటీ రియల్ ఎస్టేట్ మార్కెట్ గ్రోత్ లో పెద్ద పెద్ద రియాల్టీ కంపెనీలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మన దేశం నుంచే కాదు ఫారిన్​ కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎల్ అండ్ టీ, షాపూర్ జీ పల్లోన్జీ, లోధా బిల్డర్స్, ప్రెస్టిజ్ గ్రూప్, ఎస్ఎంఆర్ హోల్డింగ్, రాంకీ గ్రూప్, ఫోనిక్స్ గ్రూప్, సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, డీఎల్ఎఫ్ లాంటి కంపెనీలు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయి. చాలా ఏళ్లుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ లో కొత్త కొత్త బిల్డర్లు తెరపైకి వస్తుండగా కొందరు కనుమరుగయ్యారు. ఎప్పటికప్పుడు కస్టమర్లకు అభిరుచులకు అనుగుణంగా, మార్కెట్ లో డిమాండ్ ను బట్టి ప్రాజెక్టులు చేపపడుతున్న బిల్డర్లకు ఢోకా లేదు. మాల్స్, టౌన్ షిప్ లు, హోటల్స్ , టెక్ పార్కులు, లగ్జరీ విల్లాల నిర్మాణాలతో కస్టమర్లను ఆకట్టుకుంటూ హైదరాబాద్ బిల్డర్లు అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో ఉన్నారు.

తప్పటడుగుల నుంచి.. ఎంతో ఎదిగింది

తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ అస్థిరత పెట్టుబడులపై ప్రభావం చూపింది. 2009 నుంచి  2014 వరకు అన్ని రంగాల్లో డౌన్ ట్రెండ్ కొనసాగింది. కొత్త ప్రాజెక్టులు ఆగిపోయాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత గాడిలో పడిన పాలనతో పెట్టుబడుల రాక మొదలైంది.టీఎస్ ఐ పాస్ విధానంతో పెట్టుబడులు రావడంతో, రియల్ మార్కెట్ లో  కూడా దానికి తగినట్లుగానే మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం బెంగుళూరు, పుణె తరహాలో కమర్షియల్ స్పేస్ కు డిమాండ్ ఉండగా.. కో లివింగ్, కో వర్కింగ్ స్పేస్ లో స్టార్టప్ కంపెనీల నుంచి ఫారిన్ కంపెనీలు కూడా రంగప్రవేశం చేశాయి. హైదరాబాద్ బేస్డ్ సంస్థలూ ఈ రంగంలో పెట్టుబడులు పెడుతున్నాయి. భారీగా ల్యాండ్ బ్యాంక్ ఉండటంతో రెసిడెన్షియల్ సెగ్మెంట్ లో కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తూనే, మరో వైపు డిమాండ్ ఉన్న ఆదాయ మార్గాలుగా కమర్షియల్, కో లివింగ్ స్పేస్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నాయి.

For More News..

కేటీఆర్ నమస్తే.. హరీశ్ షేక్ హ్యాండ్..

‘మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు.. ఎన్నికల్లో కోట్లు సంపాదించాడు’

ఈసారి బడ్జెట్ ​1.55 లక్షల కోట్లు!