హైదరాబాద్: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మోంథా తుఫాను వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను గమనంలోకి తీసుకుని ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని చెప్పారు.
మోంథా తుఫాను ప్రభావిత జిల్లాల్లో తీసుకున్న జాగ్రత్తలు, తీసుకోవలసిన చర్యలు, తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణ, సహాయక చర్యలపై మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో గురువారం (అక్టోబర్ 30) సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవలసిన చర్యలపై సీఎం అధికారులకు సూచనలిచ్చారు. అధికారుల సెలవులను రద్దు చేసి క్షేత్రస్థాయిలో పర్యటించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి ప్రతి 24 గంటల పరిస్థితిపై రోజువారిగా కలెక్టర్లకు నివేదికలు అందించాలని చెప్పారు.
నివేదికలు అందించడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం సేకరణలో పౌర సరఫరాల విభాగం ఎప్పటికప్పుడు కలెక్టర్లకు పరిస్థితులను వివరిస్తూ అవసరమైన సూచనలు చేయాలన్నారు. వరి కోతల కాలంలో తుపాను కారణంగా అనుకోని ఉపద్రవం రైతుల్లో తీవ్ర ఆవేదన మిగుల్చుతుందని, ఇలాంటి సందర్భాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పరిస్థితులకు అనుగుణంగా ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాళ్లకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందేనని, పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్, ఎస్పీలు సంయుక్తంగా ఒక మానిటరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఇంచార్జీ మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందని తెలిపారు. సహాయక చర్యలను ఎలాంటి లోటు లేకుండా, ఎక్కడా ప్రాణ నష్టం జరక్కుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను మళ్లించాలని, ఎక్కడా ప్రాణ నష్టం, ఆస్తినష్టం జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా చెరువులు, వాగులు, మేజర్, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, లోలెవల్ కల్వర్టుల వద్ద పరిస్థితిపై స్థానికులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
