అబ్దుల్లాపూర్‌మెట్, వెలుగు: ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్బెడ్రూమ్ఇండ్లు ఇస్తానని చెప్పి మభ్యపెడుతోందన్నారు. ప్రజా సంఘాల పో రాట వేదిక కన్వీనర్ ఎస్.వీరయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్ర వ్యాప్త బస్సుయాత్ర మంగళవారం తుర్కయంజాల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రాఘవులు పాల్గొని మాట్లాడారు.
ఇండ్లు లేని నిరుపేదలు ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్‌చేసి జైలుకు పంపిందని, బడా కంపెనీలకు మాత్రం వేల ఎకరాలు కట్టబెడుతోందని మండిపడ్డారు. జులై 3న పేదలకు స్థలాలు, పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డు ఇవ్వాలని కోరుతూ అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేపట్టనున్నట్లు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన బస్సు యాత్ర తుర్కయంజాల్ లో ముగిసిందన్నారు. కార్యక్రమంలో నాయకులు జాన్ వెస్లీ, టి.సాగర్, పి.జంగారెడ్డి, ఆర్.వెంకట్రాములు, లక్ష్మి, స్కైలాబ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
