
హుజురాబాద్ సహా దేశవ్యాప్తంగా 29 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి, మధ్యప్రదేశ్ లో కంద్వా, దాద్ర నగర్ హవేలి లోక్ సభ స్థానాలకు ఇవాళ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆయా స్థానాల్లో గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు చనిపోవడంతో...బై ఎలక్షన్ నిర్వహిస్తున్నారు. మండీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ...కంద్వా ఎంపీ నంద కుమార్ చౌహన్ మార్చిలో చనిపోయారు. ఇక దాద్ర ఎంపీ మోహన్ దెల్కర్ ఆత్మహత్య చేసుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మండీ, కంద్వ ఎంపీ స్థానాలు గతంలో BJP ఖాతాలో ఉండగా...దాద్ర నుంచి దేల్కర్ స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు.
ఇక బెంగాల్ లో ఇవాళ నాలుగు అసెంబ్లీ స్థానాలకు బై పోల్ జరుగుతోంది. కూచ్ బెహార్ జిల్లాలోని దిన్హాట, నదియా జిల్లాలోని శాంతిపూర్, నార్త్ 24 పరగణ జిల్లాలోని కర్దా, సౌత్ 24 పరగణ జిల్లాలోని గోసబ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు.
అస్సాంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. కోక్రాజర్ జిల్లాలోని గోస్సాయ్ గావ్, బక్స జిల్లాలోని తముల్ పూర్, జోర్హాట్ జిల్లాలోని మరియణి, తౌరా, బార్పేట జిల్లాలోని భవానిపూర్ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక రాజస్థాన్ లోనూ వల్లభ్ నగర్, దరియావాడ్ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఉప ఎన్నికను అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం...ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక మధ్యప్రదేశ్ లో కంద్వ ఎంపీ సీటుతో పాటు రాయ్ గావ్, జోబాట్, పృథ్విపూర్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇక ఏపీలోని బద్వేల్, కర్ణాటకలోని హనగల్, సింద్గి స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై బాధ్యతలు తీసుకున్న తర్వాత జరుగుతున్న మొదటి ఎలక్షన్ ఇది. మేఘాలయ మూడు, హిమాచల్ ప్రదేశ్ లో మూడు స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక బిహార్ లో రెండు, మహారాష్ట్ర, మిజోరాంలో ఒక్కొ స్థానానికి బై పోలింగ్ జరుగుతోంది. హర్యాణలోని ఎల్లెనాబాద్ కు ఎలక్షన్ జరుగుతోంది.