ప్రాణం తీసిన మొక్కజొన్న కుప్ప.. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి..వనపర్తి జిల్లాలో ఘటన

ప్రాణం తీసిన మొక్కజొన్న కుప్ప.. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి..వనపర్తి జిల్లాలో ఘటన

రేవల్లి, వెలుగు: రోడ్డుపై ఆరబోసిన మక్కజొన్న కుప్పలు ఒక యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ ఘటన ఆదివారం రాత్రి వనపర్తి జిల్లా ఏదుల మండలంలోని పాలమూరు–రంగారెడ్డి రిజర్వాయర్ బ్రిడ్జిపై జరిగింది. ఏదుల గ్రామానికి చెందిన వీరపాగ కృష్ణ(25) బైక్‌‌పై రేవల్లి నుంచి స్వగ్రామానికి వెళ్తున్నాడు. 

బ్రిడ్జిపై అనంతపురం గ్రామానికి చెందిన రైతు చిన్న నరసింహ్మ మక్కజొన్నలను కుప్పగా పోసి వాటిపై నల్లటి కవర్లు కప్పాడు. చీకటిలో ఆ కుప్పలు కనిపించకపోవడంతో కృష్ణ బైక్ వాటిపైకి దూసుకెళ్లింది. దీంతో బైక్ అదుపుతప్పి కృష్ణకు తీవ్ర గాయాలై స్పాట్​లో మృతిచెందాడు. చేతికందిన కొడుకు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. రోడ్లపై ధాన్యం ఆరబోసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, కుటుంబ సభ్యులు అధికారులను డిమాండ్​ చేశారు. 

విరిగిన చెట్టును తప్పించబోయిన మరొకరు..

వెంకటాపురం: రోడ్డు ప్రమాదంలో ఫారెస్ట్ బేస్ క్యాంప్ కార్మికుడు మృతిచెందాడు. వెంకటాపురం ఎస్ఐ కొప్పుల తిరుపతి తెలిపిన ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి ఫారెస్ట్​ సెక్షన్ ఆఫీసర్ గూగుల్ దేవయ్య, బేస్ క్యాంప్ కార్మికుడు కల్లూరి లక్ష్మయ్యతో కలిసి మరికాల బీట్‌‌లో పెట్రోలింగ్ నిర్వహించి తిరిగి వస్తున్నారు.

మార్గమధ్యంలో రోడ్డుపై చెట్టు విరిగిపడి ఉండటంతో దానిని తప్పించబోయే క్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలయ్యాయి. వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం భద్రాచలం తరలిస్తుండగా మార్గమధ్యంలో లక్ష్మయ్య మృతిచెందాడు. సెక్షన్ ఆఫీసర్ దేవయ్య చికిత్స పొందుతున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటాపురం ఎస్సై తెలిపారు.