జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ

జీవో 317పై కేబినెట్ సబ్ కమిటీ
  • మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్​గా ఏర్పాటు

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగాల జోనల్ అలకేషన్‌‌కు సంబంధించిన జీవో 317, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జీవో 46 సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేబినెట్ సబ్‌‌ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్‌‌గా వ్యవహరించనుండగా, మంత్రులు శ్రీధర్‌‌‌‌బాబు, పొన్నం ప్రభాకర్‌‌‌‌ సభ్యులుగా ఉన్నారు. ఈ మేరకు శనివారం సీఎస్‌‌ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సబ్ కమిటీ కన్వీనర్‌‌గా‌‌ జనరల్ అడ్మినిస్ట్రేషన్ (సర్వీసెస్‌‌) సెక్రటరీ ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కమిటీ 317 జీవో వల్ల నెలకొన్న సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నది. 317 జీవో వల్ల చాలా మంది ఉద్యోగాలు తమ సొంత జోన్లకు బదులు, వేరే జోన్లలో పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఈ జీవోను మొదట్నుంచీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగులు, టీచర్లు అనేకసార్లు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. అయినా గత సర్కార్ ఈ ఆందోళనలను పట్టించుకోకుండా జీవోను అమలు చేసింది. ఇప్పుడు ఉద్యోగులు, టీచర్లు రేవంత్ సర్కార్‌‌‌‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే తమను సొంత జోన్లకు బదిలీ చేయాలని పలుమార్లు సర్కారు పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సబ్ కమిటీని నియమిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

టీచర్ల సంఘాల హర్షం

జీవో 317 అమలులో ఏర్పడ్డ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడంపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ మేరకు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి, పీఆర్టీయూటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం.చెన్నయ్య, భిక్షంగౌడ్, గురుకుల జేఏసీ ప్రెసిడెంట్ మామిడి నారాయణ, లోకల్ క్యాడర్ గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం.వీరాచారి తదితరులు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 2018 అమలులో భాగంగా ఉద్యోగుల శాశ్వత కేటాయింపు కోసం గత సర్కారు 2021 డిసెంబర్6న  జీవో 317ను ఏకపక్షంగా తీసుకొచ్చిందని విమర్శించారు. ఆ జీవో గైడ్ లైన్స్ తో చాలామంది టీచర్లు, ఉద్యోగులు నష్టపోయారని తెలిపారు.