న్యూఢిల్లీ: వందేభారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. కోల్ కతా–- గువాహటి మధ్య పరుగులు పెట్టనుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 17న బెంగాల్‌లోని మాల్టా నుంచి ఈ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ స్లీపర్ రైలులో వీఐపీ, ఎమర్జెన్సీ కోటాకు అనుమతి ఉండదని రైల్వే అధికారులు తెలిపారు.
కన్ఫర్మ్డ్ టికెట్లను మాత్రమే ప్రయాణికులకు జారీ చేస్తారు. దీంతో ప్రయాణికుల వెయిటింగ్ లిస్ట్ గణనీయంగా తగ్గుతుంది. ఆర్ఏసీ రిజర్వేషన్లను కూడా ఈ రైలులో అనుమతించరు. ఈ ట్రైన్లో ప్రయాణించే వారికి దుప్పటి కవర్లతో సహా పూర్తిగా అప్‌గ్రేడ్ చేసిన బెడ్‌రోల్ ను అందిస్తారు. వందే భారత్ స్లీపర్ రైలులో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ కోచ్ ఉంది.
మొత్తం 823 బెర్త్‌లలో.. 611 థర్డ్ ఏసీ బెర్త్ లు, 188 సెకండ్ ఏసీ బెర్త్ లు, 24 ఫస్ట్ ఏసీ బెర్త్ లు ఉంటాయి. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను ఈ రైలు ప్రతిబింబిస్తుందని అధికారులు పేర్కొన్నారు.
