బీర్భూమ్ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం

బీర్భూమ్ ఘటనపై సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం

పశ్చిమబెంగాల్​లోని బీర్భూమ్​ జిల్లా బొగ్టుయ్ గ్రామంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ఈ ఘటనపై ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న సిట్‌ (బెంగాల్ పోలీస్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు వివరాలను కూడా సీబీఐకి అప్పగించాలని సూచించింది. వారం రోజుల్లో దర్యాప్తుకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును న్యాయస్థానానికి అందజేయాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం ఈ కేసు విచారణను హైకోర్టు ఏప్రిల్ 7కు వాయిదా వేసింది. 

బీర్భూమ్ జిల్లా బొగ్టుయ్ గ్రామంలో మార్చి 22న జరిగిన అల్లర్లలో మూడు ఇళ్లకు నిప్పు పెట్టడంతో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. అధికార తృణమూల్ పార్టీకి చెందిన ఓ నేత మృతి తర్వాత ఈ అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఎనిమిది మందిని సజీవ దహనం చేయడానికి ముందు వారిని చిత్రహింసలు పెట్టినట్టు పోస్టుమార్టం రిపోర్ట్​లో వెల్లడైంది. మంగళవారం జరిగిన ఈ దుర్ఘటనలో సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్​ నిఫుణులు పరిశీలించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. సజీవ దహనానికి ముందు బాధితులపై దాడులు జరిగాయని, ఆ తర్వాతే వారిని ఇంట్లో బంధించి తగులబెట్టినట్టుగా భావిస్తున్నారు. ఈ విషయాన్ని రాంపూర్​హట్​ ఆస్పత్రి అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్​ సీఎం మమత ఆదేశంతో గంటల వ్యవధిలోనే స్థానిక టీఎంసీ లీడర్ అనరుల్​ షేక్​ను ​కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఈ ఘటన జరిగిన సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, ఇతర ఉద్యోగులపై వేటు వేశారు.

ఎవరీ అనరుల్ ​షేక్?

మమత ఆదేశాల మేరకు టీఎంసీ లీడర్​ అనరుల్​ షేక్​ను బెంగాల్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. బీర్భూమ్​ ఘటన జరిగిన నాటి నుంచి టీఎంసీ బ్లాక్​ ప్రెసిడెంట్​గా​ ఉన్న అనరుల్​ షేక్​ పేరు మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనలో అతని ప్రమేయం ఉన్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అతడిని వెంటనే అరెస్ట్​ చేయాలని బాధిత కుటుంబాలు కూడా డిమాండ్​ చేస్తున్నాయి. సీఎం మమత ఎదుట కూడా బాధితులు అనరుల్​ షేక్​ పేరును ప్రస్తావించి.. చర్యలు తీసుకోవాలని కోరారు. రాంపూర్​హట్​కు చెందిన అనరుల్​ షేక్.. టీఎంసీ ఏర్పాటు నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్నారు. బీర్భూమ్​ ఎమ్మెల్యే, బెంగాల్​ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్​ ఆశిష్​ బెనర్జీకి ఇతను కీలక అనుచరుడు. టీఎంసీ బ్లాక్​ ప్రెసిడెంట్​ కావడంతో బొగ్టుయ్  గ్రామంలో రాజకీయ పరిణామాలను ఇతడే కంట్రోల్​ చేస్తుంటాడు.