
కోల్‌కతా: ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డాక్టర్లు, మహిళలు ఎక్కడిక్కడ తమ నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా, ఈ వ్యవహారంపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
సీబీఐకి బదిలీ
జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు విచారణను కోల్‌కతా హైకోర్టు మంగళవారం(ఆగష్టు 13) సీబీఐకి బదిలీ చేసింది. ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను వెంటనే సీబీఐ అధికారులకు అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి మూడు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని సీబీఐ అధికారులను కోర్టు ఆదేశించింది.
ఘటన జరిగిన ఐదు రోజులు గడిచినప్పటికీ, దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. విచారణ ఇలానే కొనసాగితే, తమకు న్యాయం జరిగే దారులు ఉండవని బాధితురాలి తల్లిదండ్రులు భయపడుతున్నారని కోర్టు పేర్కొంది. అంతకుముందు కోర్టు పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు జరపాలని కోరుతూ ట్రైనీ డాక్టర్ తల్లిదండ్రులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై సీబీఐ విచారణ కోరుతూ పలు పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
నిందితుడు అశ్లీలానికి బానిస..
కాగా, ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేయగా, పోలీసుల ముందు నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. దక్షిణ కోల్‌కతాలోని శంభునాథ్ పండిట్ పరిధిలో నివసించే ఇతడు అశ్లీలానికి బానిసైనట్లు పోలీసులు నిర్ధారించారు. అతడి మొబైల్‌లో అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు గుర్తించారు. పైగా హత్యాచారానికి గురైన ట్రైనీ వైద్యురాలి ప్రాథమిక పోస్టుమార్టం నివేదికతో అతడి పైశాచికత్వం బయటపడింది. మృతురాలి శరీరంపై గాయాలు లేవన్న అవయవం లేదు. ముఖం, కడుపు, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. రహస్య అవయవాల నుంచి బ్లీడింగ్ అయినట్లు తేలింది.