- కులాల వారీగా దావత్ లు వలస ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నాలు
- మొదటి విడత ఎన్నికలకు సర్వం సిద్ధం
నల్గొండ, వెలుగు: పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర పడింది. వారం రోజులుగా నామినేషన్లు, ప్రచారాలతో సందడి నెలకొన్న గ్రామాల్లో మంగళవారం సాయంత్రంతో మూగబోయాయి. ఇక పోలింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి.. పోలింగ్ సామగ్రిని పంపించారు. పోలింగ్ సిబ్బందికి కూడా రెండు విడతల్లో శిక్షణ పూర్తి చేశారు.
మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనుండగా మొదటి విడత నల్గొండ జిల్లాలో నల్గొండ, చండూరు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 14 మండలల్లోని 318 గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరగనున్నాయి. సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, మద్దిరాల, నాగారం, జాజిరెడ్డి గూడెం, తిరుమలగిరి, నూతనకల్, సూర్యాపేట, ఆత్మకూర్ (ఎస్) మండలాల్లోని 159 గ్రామ పంచాయతీలు, 1,442 వార్డుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది..
రేపు మొదటి విడత పోలింగ్ జరగనున్నందున మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రి చేరుకుంది. పోలింగ్ బాక్సులు కూడా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకున్నాయి. ఉదయం 10 గంటల నుంచి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద నుంచి సిబ్బంది ఎన్నికల సామగ్రిని తీసుకుని పోలీస్ బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు వెళ్లనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి గెలిచిన వారిని ప్రకటించనున్నారు. దీంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.పల్లె పోరులో గెలుపే అంతిమ లక్ష్యంగా అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపారు.
ఓటింగ్‌కు ఒక్కరోజు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థులు మద్యం, డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్ చేస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో పలువురు నాయకులు ఇప్పటికే మద్యం డంప్‌లను తరలించారు. నేటి రాత్రికి మద్యం పంపిణీ పూర్తి చేసేలా నాయకులు ప్లాన్ చేసుకున్నారు. మరోపక్క వలస ఓటర్ల పై దృష్టి పెట్టిన అభ్యర్డులు ఎలాగైనా రప్పించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక గ్రామాల్లో సామాజిక వర్గాల వారీగా దావత్ లు ఏర్పాటు చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల పరిశీలించిన కలెక్టర్
గ్రామపంచాయతీ ఎన్నికల నేపధ్యంలో పోస్టల్ బ్యాలెట్, ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రంలో చేపట్టిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పరిశీలించారు. మంగళవారం నల్గొండ మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. పోలింగ్ సామమాగ్రి పంపిణీకి అవసరమయ్యే ఏర్పాట్లను నల్లగొండ మండల కేంద్రంలోని ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, ఈ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఉద్యోగి నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. ఎన్నికల సామగ్రిని ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ్యాలెట్ పంపిణీ, స్వీకరణ జరగాలన్నారు. ప్రతి బండిల్‌పై సీల్, సంతకాలు లాంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.
ఎన్నికల సామగ్రి పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు ఎన్నికల సామగ్రి సరఫరా వ్యవస్థ, రిసెప్షన్ రూమ్ కార్యకలాపాలను పరిశీలించారు. సామగ్రి పంపిణీ సమయంలో ప్రతి పోలింగ్ బృందానికి అవసరమైన సామగ్రి సమయానికి అందించేందుకు ప్రత్యేక డెస్కులు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్టీవో అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీవో యాకూబ్ నాయక్ కలెక్టర్ వెంట ఉన్నారు.
