- 10 క్రీడాంశాల్లో 125 మంది బరిలోకి
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌కు ఇండియా బృందం సిద్ధమైంది. గత రెండు దశాబ్దాలుగా టాప్–5లో నిలుస్తూ వచ్చిన ఇండియా ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఈ క్రీడల్లో ప్రధానంగా బాక్సింగ్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ విభాగాలపైనే ఇండియా ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. ఈసారి కామన్వెల్త్‌లో క్రీడాంశాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఇండియాకు ఎక్కువగా మెడల్స్ తెచ్చే రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షూటింగ్ విభాగాలను పోటీల నుంచి తొలగించారు.
బర్మింగ్‌హామ్ ఎడిషన్‌లో ఇండియా సాధించిన 61 మెడల్స్‌లో 25 పతకాలు ఈ నాలుగు క్రీడల నుంచే రావడం విశేషం. దాంతో ఇప్పుడు టాప్–5 ప్లేస్‌ను పదిలం చేసుకోవడం ఇండియా అథ్లెట్లకు కొంత సవాలుగా మారింది. అథ్లెటిక్స్‌లో 32 మందితో కూడిన అతి పెద్ద బృందం బరిలోకి దిగుతోంది. స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఫేవరెట్‌గా ఉన్నాడు. అయితే రుమేష్ తరంగ (శ్రీలంక), అర్షద్ నదీమ్ (పాకిస్తాన్) నుంచి గట్టి పోటీ ఎదురుకావొచ్చు.
లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్, హైజంపర్ సర్వేశ్ కుషారే, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్, మెన్స్, విమెన్స్ 4X400 మీటర్ల రిలే జట్ల నుంచి కూడా ఇండియా పతకాలను ఆశిస్తోంది. వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయ్ చాను హ్యాట్రిక్ స్వర్ణంపై కన్నేసింది. మొత్తం 11 మంది లిఫ్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీ), జైస్మిన్ లంబోరియా (57 కేజీ), ప్రీతి పవార్ (54 కేజీ), సాక్షి చౌదరి (51 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ), మెన్స్‌లో నరేందర్ బెర్వాల్ (+90 కేజీ), సచిన్ సివాచ్ (60 కేజీ) పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.
ఇండియా నుంచి మొత్తం 125 మంది 10 క్రీడాంశాల్లో పోటీ పడుతున్నారు. ఓవరాల్‌గా 74 దేశాల నుంచి 3 వేల మంది అథ్లెట్లు బరిలో ఉన్నారు. నాలుగు వేదికల్లో పోటీలు జరగనున్నాయి. అదే టైమ్‌లో పారా ఈవెంట్‌లను కూడా నిర్వహించనున్నారు. పెరుగుతున్న ఖర్చుల కారణంగా 2023లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా ఆతిథ్య హక్కులను వదులుకోవడంతో పోటీలను నిర్వహించేందుకు గ్లాస్గో ముందుకొచ్చింది.
