ప్రెగ్నెన్సీ టైమ్‌‌‌‌లో పారాసిటమాల్ వాడొచ్చు.. పుట్టే పిల్లలకు ఆటిజం, ఏడీహెచ్‌‌‌‌డీ రాదు

ప్రెగ్నెన్సీ టైమ్‌‌‌‌లో పారాసిటమాల్ వాడొచ్చు.. పుట్టే పిల్లలకు ఆటిజం, ఏడీహెచ్‌‌‌‌డీ రాదు

హైదరాబాద్, వెలుగు: ‘‘గర్భంతో ఉన్నప్పుడు జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోవాలా? వద్దా? వేసుకుంటే.. పుట్టే బిడ్డకు తెలివి తక్కువగా ఉంటుందా? ఆటిజం వస్తుందా?’’.. ఇవీ ఈ మధ్య కాలంలో గర్భిణులను వస్తున్న అనుమానాలు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చూసి, చిన్నపాటి జ్వరం వచ్చినా ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు. కానీ ఇక ఆ భయం అక్కర్లేదంటున్నారు.. ఇటలీ, యూకే, నార్వే, స్వీడన్ దేశాలకు చెందిన వైద్య నిపుణులు. గర్భిణులు పారాసిటమాల్ వాడటం పూర్తి సురక్షితమని, దీనివల్ల పుట్టబోయే పిల్లల మెదడు ఎదుగుదలపై ఎలాంటి ఎఫెక్ట్ పడదని స్పష్టం చేశారు. 

గతంలో కొన్ని స్టడీలు ప్రెగ్నెన్సీలో పారాసిటమాల్ ఎక్కువగా వాడితే పిల్లల్లో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, ఏడీహెచ్‌‌‌‌డీ వచ్చే చాన్స్ ఉందని చెప్పాయి. 2025లో అమెరికా ప్రభుత్వం కూడా దీనిపై ఒక వార్నింగ్ ఇచ్చేసరికి జనం భయపడ్డారు. ఈ కన్ఫ్యూజన్‌‌‌‌ ను క్లియర్ చేయడానికే మెడ్‌‌‌‌లైన్, ఎంబేస్, కాక్రాన్ వంటి అంతర్జాతీయ మెడికల్ లైబ్రరీల నుంచి దాదాపు 43 రకాల స్టడీలను దీనికోసం పరిశీలించారు. ఇందులో స్వీడన్‌‌‌‌కు చెందిన 24 లక్షల మంది, జపాన్‌‌‌‌కు చెందిన 2 లక్షల మందికి పైగా పిల్లల డేటాను విశ్లేషించారు. ఈ స్టడీ ఇటీవలే  ఇంటర్నేషనల్ జర్నల్ ది లాన్సెట్‌‌‌‌లో పబ్లిష్ అయింది.

26 లక్షల మందిపై స్టడీ.. 

ఈ స్టడీ కోసం దాదాపు 26 లక్షల మంది పిల్లల డేటాను సైంటిస్టులు అనలైజ్ చేశారు. ఇందులో అమెరికా, స్వీడన్, జపాన్ వంటి దేశాల డేటా ఉంది. పారాసిటమాల్ వాడిన తల్లులు, వాడని తల్లులు.. వాళ్లకు పుట్టిన పిల్లల హెల్త్ రికార్డులను సిస్టమాటిక్ రివ్యూ అండ్ మెటా అనాలసిస్ చేశారు. గతంలో వచ్చిన స్టడీలు ఎందుకు తప్పు చెప్పాయంటే.. వాళ్లు కేవలం మందు వాడారా? లేదా? అనేది మాత్రమే చూశారు. కానీ తల్లిదండ్రుల నుంచి వచ్చే జీన్స్, ఇంట్లోని వాతావరణం వంటివి పట్టించుకోలేదు.

 ఈసారి సైంటిస్టులు సిబ్లింగ్ కంపారిజన్ అనే పద్ధతి వాడారు. ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలను తీసుకున్నారు. ఒక బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి పారాసిటమాల్ వాడింది.. రెండో బిడ్డ అప్పుడు వాడలేదు. ఇద్దరినీ పోల్చి చూస్తే.. మందు వాడిన బిడ్డకు, వాడని బిడ్డకు మెదడు ఎదుగుదలలో ఏ తేడా లేదు. అంటే ఆటిజం, ఏడీహెచ్‌‌‌‌డీ రావడానికి కారణం తల్లి జీన్స్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలే తప్ప.. పారాసిటమాల్ కాదని క్లియర్‌‌‌‌‌‌‌‌గా తేలిపోయిందని స్టడీ స్పష్టం చేసింది. 

ట్యాబ్లెట్ వేసుకోకుంటేనే అసలు ముప్పు..

జ్వరం వచ్చినా ట్యాబ్లెట్ వేసుకోకుంటేనే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తల్లికి హైఫీవర్ ఉంటే అది కడుపులోని బిడ్డకు సీరియస్ అవుతుందని, నొప్పులు భరించడం వల్ల తల్లి ఒత్తిడికి గురైతే.. అబార్షన్ అయ్యే ప్రమాదం ఉందని, ప్రీ-మెచ్యూర్ డెలివరీ జరిగే చాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే జ్వరం, భరించలేని నొప్పులు ఉన్నప్పుడు పారాసిటమాల్‌‌‌‌ను ఫస్ట్ లైన్ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌గా డాక్టర్ల సూచనతో వాడాలని ఈ స్టడీ స్పష్టం చేసింది. ఈ స్టడీలో ప్రధానంగా మూడు విషయాలపై నిపుణులు క్లారిటీ ఇచ్చారు. ఆటిజం, పిల్లల్లో తెలివితేటలు తగ్గడం వంటి సమస్యలకు పారాసిటమాల్ కారణం కాదని తేల్చి చెప్పింది. 

డాక్టర్ల సూచనతోనే వాడాలి..

జ్వరానికి, నొప్పులకు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడొచ్చు కదా అని... ఇష్టమొచ్చినట్లు మందులు వాడొద్దని సైంటిస్టులు హెచ్చరించారు. నొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ సలహా మేరకు నిర్ణీత డోసులో పారాసిటమాల్ వాడటం మంచిదని స్పష్టం చేశారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా దీన్నే రికమండ్ చేస్తున్నాయి. పాత వార్తలు నమ్మి మందులు మానేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని ఫ్రాన్సిస్కో డి ఆంటోనియో (ఇటలీ), మారియా ఎలీనా ఫ్లాకో (ఇటలీ), ఆస్మా ఖలీల్ (లండన్), అథినా సమారా (నార్వే) తదితర పరిశోధకులు సూచించారు.