కెనడాలో మరో హిందూ దేవాలయం ధ్వంసం

కెనడాలో మరో హిందూ దేవాలయం ధ్వంసం

కెనడాలోని హిందూ దేవాలయాల భద్రతపై భారతదేశం నిరంతరం తీవ్ర ఆందోళనలను లేవనెత్తుతున్నప్పటికీ, ఆగస్టు 12న మరో హిందూ దేవాలయం ధ్వంసమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన అనంతరం దుండగులు ఆలయ ప్రధాన ద్వారంపై ఖలిస్థాన్ రెఫరెండం పోస్టర్లను అంటించారు. ఈ పోస్టర్ లో ‘జూన్ 18న జరిగిన హత్యలో భారత్ పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తోంది’ అని ఉంది. ఈ పోస్టర్లో హర్దీప్ సింగ్ నిజ్జర్ ఫొటో కూడా కనిపిస్తోంది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని సర్రేలోని గురునానక్ సిక్కు గురుద్వారా సాహిబ్ అధిపతిగా ఉండేవారు.  అలాగే వేర్పాటువాద సంస్థ ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) చీఫ్ గా వ్యవహరించారు. జూన్ 18న సాయంత్రం గురుద్వారా ఆవరణలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆయనను హత్య చేశారు. కాగా.. ప్రస్తుతం ధ్వంసమైన ఈ ఆలయం.. సర్రేలోని లక్ష్మీ నారాయణ్ మందిర్ గా తెలుస్తోంది. ఇది బ్రిటీష్ కొలంబియాలోని అతిపెద్ద, పురాతన హిందూ దేవాలయాలలో ఒకటిగా ఉంది. ఈ ఏడాది కెనడాలో దేవాలయాల విధ్వంసం జరగడం ఇది మూడోసారి.

జనవరి 31న కెనడాలోని బ్రాంప్టన్ లోని ప్రముఖ హిందూ దేవాలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై భారత్ వ్యతిరేక నినాదాలతో తీవ్రంగా స్పందించింది. ఆలయ గోడలపై భారత్ ను ఉద్దేశించి విద్వేషపూరిత సందేశాలు రాసిన ఘటనను బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ ఖండించారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్ లో కెనడాలోని ఒంటారియోలోని మరో హిందూ దేవాలయాన్ని భారత్ వ్యతిరేక గ్రాఫిటీతో ధ్వంసం చేశారు. ఈ దేవాలయం గోడలపై ఇద్దరు అనుమానితులు పెయింటింగ్ స్ప్రే చేస్తున్న దృశ్యాలు కూడా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన ఫుటేజీలను పోలీసులు విడుదల చేశారు.