- ప్రతి నలుగురిలో ముగ్గురి వీసాలు రిజెక్ట్
- 75 శాతం వీసాలను పక్కన పెట్టిన అధికారులు
టొరంటో: కెనడాలో ఉన్నత విద్య అభ్యసించడానికి దరఖాస్తు చేసుకున్న ఇండియన్ స్టూడెంట్లకు కెనడా ప్రభుత్వం షాకిచ్చింది. ఇండియన్ స్టూడెంట్ వీసా అప్లికేషన్లను ఆ దేశ ప్రభుత్వం భారీగా తిరస్కరించింది. ప్రతి నాలుగు దరఖాస్తుల్లో ముగ్గురి దరఖాస్తులను అధికారులు రిజెక్ట్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో ఇండియన్ స్టూడెంట్లు చేసుకున్న అప్లికేషన్లలో 75శాతం దరఖాస్తులను తిరస్కరించారని కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్ మెంట్ తెలిపింది. అలాగే, చైనా స్టూడెంట్ వీసాలను 24 శాతం తిరస్కరించారని వెల్లడించింది. ఓవరాల్ గా మిగతా దేశాల స్టూడెంట్ వీసాల తిరస్కరణ 40 శాతమని పేర్కొంది.
కాగా.. 2023లో 32 శాతం భారతీయ విద్యార్థి వీసా అప్లికేషన్లను కొట్టివేస్తే.. ఈసారి ఆ సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువ ఉంది. అంతర్జాతీయ విద్యార్థి వీసా ప్రోగ్రామ్ ను కెనడా మరింత కఠినం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్ వీసాలను భారీగా రిజెక్ట్ చేస్తోంది. కాగా.. విదేశీ విద్యార్థులను తమ దేశంలో చదివేందుకు అవకాశం ఇస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత కెనడా రెండో స్థానంలో ఉంది. నిరుడు దాదాపు 10 లక్షల మంది ఫారిన్ స్టూడెంట్లు తమ దేశంలో చదివేందుకు కెనడా సర్కారు అనుమతి ఇచ్చింది.
వారిలో 41 శాతం విద్యార్థులు భారత్ నుంచే ఉన్నారు. ఇక, కెనడాలో చదివేందుకు మన దేశం నుంచి అప్లై చేసుకుంటున్న స్టూడెంట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. స్థానిక పరిస్థితులు, జీవన వ్యయం, మౌలిక సౌకర్యాల కొరత వంటివి ఇందుకు కారణమని ఇమిగ్రేషన్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా, కెనడాకు ప్రత్యామ్నాయంగా ఇండియన్ స్టూడెంట్లు జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నారు.
కెనడాలో ఇండియన్పై దాడి
కెనడాలో మరో ఇండియన్పై జాత్యహంకార దాడి జరిగింది. ఈ నెల 1న కెనడాలోని ఓ మెక్ డొనాల్డ్ ఔట్లెట్లో భారత సంతతి పౌరుడిపై ఓ వ్యక్తి దాడి చేశాడు. బాధితుడు సైలెంట్‌గానే ఉన్నా దుండగుడు మాత్రం అంతటితో ఆగకుండా బాధితుడి కాలర్ పట్టుకొని కొట్టాడు. రెస్టారెంట్ వద్ద ఉన్న వారు ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అదికాస్తా వైరల్ అయ్యింది.
