విదేశాల్లో చదువు అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు తండోపతండాలుగా తరలివెళ్తున్న సంగతి తెలిసిందే. వీరి తాకిడికి హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ జాతరని తలపించింది. దీంతో వీరిని కట్టడి చేయడానికి ఎయిర్ పోర్ట్ అధికారులు హై అలర్ట్ కూడా ప్రకటించారు. విద్యార్థుల వెంట ముగ్గురు లేదా నలుగురు రావాలని వారి తల్లిదండ్రులకు సూచించారు.
ఇంత కష్టపడి వెళ్తున్న విద్యార్థులకు మరో కష్టం అడ్డొచ్చింది. కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లోని ఒక యూనివర్సిటీ ప్రారంభానికి ముందే అడ్మిషన్ లెటర్స్ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. దాదాపు 500 మంది విద్యార్థులకు నార్తర్న్ కాలేజీ యాజమాన్యం రాబోయే విద్యాసంవత్సరానికి ఇచ్చిన అడ్మిషన్ లెటర్స్ ఉపసంహరించుకుంటున్నట్లు ఈమెయిల్స్ పంపిందని సమాచారం. వీరిలో కొందరు విద్యార్థులు ఇప్పటికే కెనడా చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో వారంతా కెనడా ఎయిర్‌పోర్టులో పడిగాపులు కాస్తున్నారట.
అంతర్జాతీయ విద్యార్థులకు పరిమితికి మించి ఎక్కువ వీసాలను ఆమోదించడం వల్లే ఈ సమస్య ఏర్పడిందని నార్తర్న్ కాలేజీ పేర్కొంది. ఈ సమస్య పరిష్కారానికి తమా వంతు ప్రయత్నం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కట్టిన డబ్బులు విద్యార్థులకు రీఫండ్ చేయడం లేదా ఇతర యూనివర్సిటీలకు బదిలీ చేయడం వంటి మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపింది.