భారత హైకమిషనర్​ను గురుద్వారాకు వెళ్లనీయలె

భారత హైకమిషనర్​ను గురుద్వారాకు వెళ్లనీయలె

గ్లాస్గోలో ఖలిస్తానీ వేర్పాటువాదుల దుశ్చర్య

విషయాన్ని తీవ్రంగా తీసుకున్న యూకే ప్రభుత్వం

లండన్​: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారత్, కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం నడుస్తోంది. ఇది ఇతర దేశాల్లోని భారత హైకమిషనర్లకు కూడా ఇబ్బంది కలిగిస్తోంది. స్కాట్లాండ్‌లోని గురుద్వారాలోకి ప్రవేశించకుండా యూకే లోని భారత హై కమిషనర్ విక్రమ్‌ దొరైస్వామిని ఖలిస్థానీ సానుభూతిపరులు అడ్డుకున్నారు. గురుద్వారా సిబ్బందిపైనా వారు బెదిరింపులకు పాల్పడ్డారు.

 స్వల్ప ఘర్షణ కూడా జరగడంతో.. దొరైస్వామి  వెనుదిరగాల్సి వచ్చింది. దొరైస్వామి ఆల్బర్ట్ డ్రైవ్‌లోని గ్లాస్గో గురుద్వారాకు చెందిన కమిటీతో సమావేశాన్ని ప్లాన్ చేసినట్లు తెలుసుకున్న ఖలిస్థానీ సానుభూతిపరులు.. అక్కడికి చేరుకొని ఆయనను అడ్డగించారు. బ్రిటన్‌లోని ఏ గురుద్వారాలోనూ భారత అధికారులకు ఆహ్వానం లేదన్నారు. 

స్పందించిన యూకే ప్రభుత్వం?

భారత హైకమిషనర్‌ను గురుద్వారాలోకి ప్రవేశించకుండా అడ్డుకున్న ఘటనను బ్రిటన్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిందని నేషనల్ ​మీడియా కథనాలు వెల్లడించాయి. ‘పోలీసులు సమయానికి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భారత్‌కు యూకే హామీ ఇచ్చింది. యూకేలోని గురుద్వారాలకు భారతీయులకు ఎప్పుడూ ఆహ్వానం ఉంటుంది. సోషల్​మీడియాలో ప్రచారం కోసం కొందరు ఈ తరహా ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు’ అని యూకే ప్రభుత్వం స్పందించినట్లుగా తెలుస్తోంది.