ఇంటర్​ ఆన్​లైన్ వాల్యుయేషన్​ టెండర్ రద్దు

ఇంటర్​ ఆన్​లైన్ వాల్యుయేషన్​ టెండర్ రద్దు

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్​లో ఆన్సర్ షీట్ల ఆన్​ లైన్ వాల్యుయేషన్​కు స్పందన కరువైంది. కేవలం ఒక్క సంస్థ మాత్రమే టెండర్ వేసింది. దీంతో నిబంధనల ప్రకారం మళ్లీ కొత్తగా టెండర్ నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే, జనవరి 24న ఇంటర్ లో ఆన్​లైన్ వాల్యుయేషన్ కోసం ఇంటర్ బోర్డు టెండర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇటీవల జరిగిన ప్రీ బిడ్​కు 9 సంస్థలు రాగా.. టెండర్లు వేసేందుకు మత్రం ఎవరూ ముందుకు రాలేదు. ఒక్క మ్యాగ్నిటిక్ సంస్థ మాత్రమే టెండర్ కోడ్ చేసినట్టు ఇంటర్ బోర్డు సీవోఈ జయప్రద బాయి, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ ప్రకటించారు. దీంతో కొత్త టెండర్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఆఫీసర్లు వెల్లడించారు. ఇంటర్ ​ఆన్​లైన్ వాల్యుయేషన్​ టెండర్ రద్దుపై ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూధన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టెండర్​లో మార్పులు చేయాలన్నారు. లెక్చరర్లకు శిక్షణ ఇచ్చి, ప్రయోగాత్మకంగా మేలో జరిగే అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ నుంచి ఆన్ లైన్ వాల్యువేషన్​అమలు చేయాలని సూచించారు.