మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు రద్దు

మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు రద్దు

వరుసగా మూడు నెలలు రేషన్ తీసుకోకపోతే రేషన్ కార్డు ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అయిదో రోజు అసెంబ్లీ సమావేశాలలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బీపీఎల్ కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డుల జారీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంగుల కమలాకర్ సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుల కోసం 9,41,641 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 3,59,974 మందికి ఆహార భద్రతా కార్డులు జారీ చేశామన్నారు. 92 వేల దరఖాస్తులను తిరస్కరించామని, 4,88,775 కార్డుల దరఖాస్తులు ప్రాసెస్‌లో ఉన్నాయని ఆయన తెలిపారు. ఆహార భద్రతా కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. గత మూడు సంవత్సరాల్లో హైదరాబాద్‌లో 44,734 కార్డులు ఇచ్చామని.. మరో 97,981 కార్డులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కరోనా కారణంగానే కొత్త కార్డులను జారీ చేయలేకపోయామని మంత్రి స్పష్టం చేశారు. పెండింగ్ దరఖాస్తులను త్వరలోనే వెరిఫై చేసి ప్రతి ఒక్క అర్హుడికి తెల్ల రేషన్ కార్డులను జారీ చేస్తామన్నారు.