
హైదరాబాద్: రాబోయే కాలంలో 70 శాతం కాన్సర్ కేసులు పెరగొచ్చని.. అందుకే ముందస్తు స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు మంత్రి దామోదర రాజనర్సింహ. మంగళవారం (సెప్టెంబర్ 9) సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని 34 జిల్లాల డే కేర్ క్యాన్సర్ సెంటర్లను వర్చువల్గా ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి రాజనర్సింహ మాట్లాడుతూ.. 34 జిల్లాల్లో కాన్సర్ డే కేర్ సెంటర్స్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. 20 పడకల కెపాసిటీ తో 34 సెంటర్స్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.
ALSO READ : గ్రూప్ 1 పరీక్షపై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేయనున్న TGPSC
కాన్సర్ నివారణ కు నూరి దత్తాత్రేయ సేవలు మరువలేనివని కొనియాడిన మంత్రి రాజనర్సింహా.. దత్తాత్రేయను ఆరోగ్య శాఖ సలహా దారుగా నియమించుకున్నామని పేర్కొన్నారు. రేడియేషన్ సెంటర్స్, మొబైల్ కాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలో మొబైల్ కాన్సర్ సెంటర్స్ పని చేస్తాయన్నారు. నర్సింగ్ విద్యార్థులకు ఫారెన్ లాంగ్వేజ్లలో ట్రైనింగ్ ఇప్పిస్తామని.. జర్మనీ, జపాన్ వెళ్లే స్థాయిలో నర్సులు ఆలోచన చేయాలని సూచించారు. జపాన్, జర్మనీ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలన్నారు. మన దగ్గర ఏడాదికి 3 వేల మందిని నర్సులను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.