
హైదరాబాద్: గ్రూప్ 1 పరీక్షపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని TGPSC నిర్ణయించింది. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్కు వెళ్లాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) భావిస్తోంది. హైకోర్టు తీర్పుపై లీగల్గా ముందుకెళ్లే మార్గాలను TGPSC అన్వేషించే పనిలో ఉంది. కోర్టు తీర్పు పట్ల ఎంపికైన అభ్యర్థుల్లో నిరాశ, ఆవేదన ఉంది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా డివిజన్ బెంచ్కి వెళ్లాలని భావిస్తున్నారు. హైకోర్టు తీర్పు జడ్జిమెంట్ కాపీ అందిన అనంతరం డివిజన్ బెంచ్కు వెళ్లే ఆలోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ గ్రూప్1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకటించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రద్దు చేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. జస్టిస్ నామవరపు రాజేశ్వర రావు ఈ తీర్పు వెల్లడించారు. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను రీవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. రీవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు వెల్లడించాలని టీజీపీఎస్సీకి హైకోర్టు స్పష్టం చేసింది. రీవాల్యుయేషన్కు వీలు కాకపోతే పరీక్షలు మళ్లీ నిర్వహించాలని న్యాయస్థానం ఆదేశించింది. రీవాల్యుయేషన్కు టీజీపీఎస్సీకి హైకోర్టు 8 నెలల డెడ్‌లైన్ విధించింది.
గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పరీక్షలు రద్దు చేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. పరీక్షలు రద్దు చేయవద్దని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇరువురి పిటిషన్లపై వాదనలు విన్న న్యాయస్థానం మంగళవారం తుది తీర్పు వెల్లడించింది. గ్రూప్-1 మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాదులు హైకోర్టులో వాదనలు వినిపించారు.
పరీక్షలు పారదర్శకంగా జరగలేదని, మూల్యాంకనంలో లోపాలున్నాయన్నారు. అర్హత లేని వారు మూల్యాంకనం చేశారన్నారు. 21 వేల మంది పరీక్ష రాస్తే కేవలం సుమారు 5 వేల మందివి ఏ ప్రాతిపదికన రీవాల్యుయేషన్ జరిపారని, అడుగడుగునా అవకతవకలు చోటుచేసుకున్నాయన్నారు. కొన్ని సెంటర్లలో పరీక్షలు రాసిన అభ్యర్థులే ఎంపికయ్యారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పరీక్షలను రద్దు చేయాలని కోరారు. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ మంగళవారం తీర్పు వెలువరించింది.