ఫిబ్రవరి 9తో ముగియనున్న ప్రచారం.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల చక్కర్లు 

ఫిబ్రవరి 9తో  ముగియనున్న ప్రచారం.. ఓటర్ల చుట్టూ అభ్యర్థుల చక్కర్లు 
  • పట్టణాల్లో పట్టు నిలుపుకునేందుకు పార్టీల ప్రయత్నాలు
  • ఎల్లుండి మున్సిపల్​ పోలింగ్​

ఆదిలాబాద్, వెలుగు:  ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఆదిలాబాద్, నిర్మల్, బైంసా, ఖానాపూర్, ఆసిఫాబాద్, కాగజ్ నగర్, చెన్నూరు, బెల్లంపల్లి, క్యాతనపల్లి, లక్సెట్టిపేట మున్సిపాటీలతోపాటు మంచిర్యాల కార్పొరేషన్ కు ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరింది. వారం రోజులుగా జోరుగా సాగుతున్న ప్రచారం సోమవారం ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

తెల్లవారుజాము నుంచి బస్తీబాట పడుతున్నారు. సమయం లేకపోవడంతో చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యువతను ఆకట్టుకునేందుకు భారీ ఆఫర్లు ఇస్తున్నారు. దావత్ ల పేరుతో టూర్లకు ప్లాన్ చేయగా, సీసీ రోడ్లు, మురికి కాలువలు, కుల సంఘాల భవనాలు నిర్మిస్తామంటూ ఓటర్లకు హామీ ఇస్తున్నారు. గల్లీల్లో ఓటర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. 

ఎవరి ధీమా వారిదే..

బల్దియా పీఠం తమదంటే తమదని నేతలు ఎవరికీ వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. తమకు 32 సీట్లు వస్తాయని ఎమ్మెల్యే పాయల్ శంకర్​, చైర్​పర్సన్ ​పీఠం కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ లీడర్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ ​పార్లమెంట్ పరిధిలోని మున్సిపల్​ఎన్నికల ఇన్​చార్జి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి స్థానికంగా ఎన్నికల ప్రచార శైలిని పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పట్టు నిలుపుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. మాజీ ఎమ్మెల్యే జోగురామన్న తన కుమారుడు మున్సిపల్ మాజీ చైర్మన్ జోగు ప్రేమేందర్ ను గట్టెక్కించేందుకు ప్రచారం ముమ్మరం చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ఢీలా పడిన బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. జనసేన, ఫార్వర్ బ్లాక్ పార్టీ, ఇండిపెండెంట్లతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయని ప్రధాన పార్టీల్లో ఆందోళన నెలకొంది. 

అభ్యర్థుల్లో టెన్షన్.. 

పోలింగ్​కు ఒక్కరోజే మిగిలి ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. కొన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నా.. పోలింగ్​కు ముందు రోజు రాత్రి పంచే మద్యం, డబ్బులే విజేతను నిర్ణయిస్తాయన్న చర్చ జరుగుతోంది. అభ్యర్థులు ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. గంప గుత్తగా ఓట్లు రాబట్టేందుకు యువజన సంఘాలు, కుల సంఘాల నాయకులు, కుల పెద్దలతో మాట్లాడుతూ.. వార్డుల అభివృద్ధికి తాము ఏం చేస్తామో తెలుపుతూ గెలిపించాలని వేడుకుంటున్నారు.