హుజూరాబాద్ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో  టికెట్ల పోటీ

హుజూరాబాద్ టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో  టికెట్ల పోటీ

కరీంనగర్, వెలుగు: ప్రస్తుతం అందరి చూపూ హుజూరాబాద్ నియోజవకవర్గం మీదే ఫోకస్‌‌‌‌ అయింది. టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించడంతో త్వరలో ఉప ఎన్నిక జరగనున్న ఆ సెగ్మెంట్‌‌‌‌లో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నుంచి ఎవరు పోటీలో ఉంటారని ఆసక్తి నెలకొంది. టికెట్ ఆశిస్తున్న వాళ్లలో కొందరు ఇప్పటికే కేటీఆర్, హరీశ్‌‌‌‌రావు ద్వారా తమకు టికెట్ ఖరారయ్యేలా లాబీయింగ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌ను హుజూరాబాద్‌‌‌‌కు చెందిన కాంగ్రెస్ నేత పాడి కౌశిక్‌‌‌‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌‌‌‌లో కలవడంపై చర్చ జరుగుతోంది. టీఆర్‌‌‌‌ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్‌‌‌‌తో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఫ్యామిలీ మెంబర్స్, మాజీ బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్‌‌‌‌రావు, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, టీఆర్‌‌‌‌ఎస్ నాయకుడు దొంత రమేశ్ పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ వినోద్ పోటీకి సుముఖంగా లేకపోతే కెప్టెన్ ఫ్యామిలీ నుంచి ఒకరిని బరిలో నిలపాలన్నది హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. మరోవైపు ఇక్కడి రాష్ట్ర నాయకుడు బండ శ్రీనివాస్ కూడా బరిలో నిలబడదామనే ఆలోచనలో ఉన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ విజయ్ కుమార్ రెండ్రోజుల కిందే హరీశ్‌‌ను కలిసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఓట్‌‌‌‌ బ్యాంక్ ఈక్వేషన్స్  

టీఆర్ఎస్ పార్టీ తొలి నుంచీ కుల రాజకీయాలు చేస్తోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టే ఎక్కడ ఎన్నికలు జరిగినా కులాల వారీగా మీటింగ్‌‌‌‌లు పెట్టడం.. ఎక్కడ ఏ కులపోళ్లు ఎక్కువుంటే ఆ కులం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను రంగంలోకి దింపడం టీఆర్‌‌‌‌ఎస్ స్ట్రాటజీగా మారింది. ఇప్పుడు హుజూరాబాద్‌‌లోనూ అదే ఈక్వేషన్‌‌ను ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది. రెడ్డి సంక్షేమ సంఘంతో కరీంనగర్ జిల్లాలో గట్టి పట్టు సాధించిన కొత్త జైపాల్‌‌‌‌రెడ్డి పేరునూ తెరపైకి తెస్తున్నట్టు సమాచారం. తాజాగా టీజేఏసీ కో కన్వీనర్‌‌‌‌గా కీలకంగా ఉన్న పిట్టల రవీందర్‌‌‌‌ పేరునూ టీఆర్‌‌‌‌ఎస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. 

కౌశిక్ ఎంట్రీ ఇస్తరా?  

పీసీసీ చీఫ్‌‌ ఉత్తమ్ కు దగ్గరి బంధువు పాడి కౌశిక్ రెడ్డి. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల మీద పోటీ చేసి ఓడిపోయారు. ఈటల బర్తరఫ్ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్‌‌‌‌తో సంబంధం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి రాజేందర్‌‌‌‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ లీడర్ల నుంచీ విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు శుక్రవారం  హైదరాబాద్‌‌‌‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్‌‌‌‌ను కౌశిక్‌‌‌‌రెడ్డి కలిశారు. వీరిద్దరూ చాలా సేపే మాట్లాడుకున్నారు. కేటీఆర్‌‌‌‌తో పాటు ఎంపీ సంతోష్ కూడా ఉన్నారు. తాము కాకతాళీయంగా కలిశామని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని కౌశిక్ వివరణ ఇచ్చారు.