V6 News

అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీలో రూల్స్ పాటించాల్సిందే

అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీలో రూల్స్ పాటించాల్సిందే
  • జీవో 154 ప్రకారం నియామకాలు చేపట్టాలని అభ్యర్థుల విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియలో రూల్స్ ప్రకారం డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్‌‌కే ప్రాధాన్యత ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. నియామకాల్లో పారదర్శకత పాటించకపోతే అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఇటీవల మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ (డీఎంఈ)కి అభ్యర్థులు వినతి పత్రం ఇచ్చారు. మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి సంబంధించి జీవో నం154లో స్పష్టమైన రూల్స్ ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.

ప్రతి 5 ఖాళీలలో మొదటి 3 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ ద్వారా, ఆ తర్వాత ఒక పోస్టును ఇన్- సర్వీస్ అభ్యర్థుల ద్వారా (లాటరల్ ఎంట్రీ), చివరిగా ఒక పోస్టును  టీవీవీపీ, డీహచ్ నుంచి ట్రాన్స్‌‌ఫర్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమాన్ని కచ్చితంగా పాటించాలని, రివర్స్ ఆర్డర్‌‌‌‌లో నియామకాలు చేపట్టవద్దని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అభ్యర్థులు ప్రస్తావించారు. లాటరల్ ఎంట్రీల కంటే ముందే డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. 

607 పోస్టుల భర్తీ వేగవంతం చేయాలి... 

మరోవైపు, 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో వేగం పెంచాలని టీఎస్ఆర్డీఏ డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని కొత్త, పాత మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉందని, దీనివల్ల అకడమిక్ ప్రొగ్రామ్‌‌లు, క్లినికల్ ట్రైనింగ్, పేషెంట్ సర్వీసులు దెబ్బతింటున్నాయని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆశిష్ అంకెం పేర్కొన్నారు. ఖాళీలు భర్తీ కాకపోవడంతో ప్రస్తుతం ఉన్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లపై పనిభారం విపరీతంగా పెరిగిపోయిందని, ఇది వారి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  నోటిఫికేషన్ ప్రకారం 607 పోస్టుల భర్తీని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ఎలాంటి అక్రమాలకు తావులేకుండా రూల్స్ ప్రకారం నియామకాలు చేపట్టాలని డాక్టర్లు కోరారు.