రెండు ఎమ్మెల్సీ సీట్లకు క్యాండిడేట్లు ఓకే!

రెండు ఎమ్మెల్సీ సీట్లకు క్యాండిడేట్లు ఓకే!
  • నాయిని సీటు నాయినికే.. మరో సీటుపై ఉత్కంఠ
  •  త్వరలో కేబినెట్ ముందుకు లిస్టు

గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ సీట్లకు క్యాండిడేట్లను సీఎం కేసీఆర్​ ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ లిస్టును త్వరలో జరిగే కేబినెట్ సమావేశం ముందు పెట్టే చాన్స్​ ఉంది. ఈ రెండు సీట్లలో ఒకటి ఈ నెల 17న మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం ముగియడంతో ఖాళీ అయింది.  ఈ సీటుకు మళ్లీ నాయినినే ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు టీఆర్​ఎస్​ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో నాయిని తన అల్లుడు కోసం ముషీరాబాద్ అసెంబ్లీ టికెట్ అడిగి భంగపడ్డారు. రెండోసారి పార్టీ పవర్​లోకి వచ్చాక తిరిగి కేబినెట్​లోకి ఆయనను తీసుకోలేదు. దీనిపై పలుసార్లు నాయిని ఆవేదన చెందారు. ఇలాంటి పరిస్థితుల్లో నాయినికి  పదవి ఇవ్వకపోతే  మరిన్ని సమస్యలు వస్తాయన్న అభిప్రాయంతో ఎమ్మెల్సీ సీటుకు ఆయనను ఓకే చేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

మరో సీటు ఉమ్మడి వరంగల్ కు

గవర్నర్  కోటాలో ఖాళీగా ఉన్న రెండో ఎమ్మెల్సీ సీటును ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన లీడర్​కు  దక్కే చాన్స్ ఉంది. రాములు నాయక్​పై అనర్హత వేటు వేయడంతో చాలా కాలంగా ఆ సీటు ఖాళీగా ఉంది. ఈ సీటు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నలుగురు లీడర్లు రేసులో ఉన్నారు. ఇందులో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య అభ్యర్థిత్వంపై సీఎం కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు మాజీ ఎంపీ సీతారాం నాయక్ , సీనియర్ లీడర్ తక్కళ్లపల్లి రవీందరావు, మాజీ స్పీకర్ మధుసుధనాచారి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఎమ్మెల్సీ పదవి కోసం దేశపతి శ్రీనివాస్, దేవి ప్రసాద్ కూడా ప్రయత్నిస్తున్నట్లు టీఆర్​ఎస్​ వర్గాల్లో చర్చ నడుస్తోంది.