గ్రూప్–1 ప్రిలిమ్స్ టఫ్..క్వశ్చన్ పేపర్ కఠినంగా ఉందన్న అభ్యర్థులు 

గ్రూప్–1 ప్రిలిమ్స్ టఫ్..క్వశ్చన్ పేపర్ కఠినంగా ఉందన్న అభ్యర్థులు 
  • గ్రూప్–-1 ప్రిలిమ్స్ టఫ్..క్వశ్చన్ పేపర్ కఠినంగా ఉందన్న అభ్యర్థులు 
  • భారీగా తగ్గిన అటెండెన్స్ పర్సంటేజీ 
  • పోయినసారి 2.80 లక్షల మంది.. 
  • ఇప్పుడు 2.33 లక్షల మందే హాజరు   
  • సెంటర్లలో కనిపించని  బయోమెట్రిక్ అటెండెన్స్ 
  • తనిఖీల్లో సిబ్బంది ఓవర్  యాక్షన్​పై అభ్యర్థుల మండిపాటు

హైదరాబాద్, వెలుగు:  గ్రూప్ –1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. పేపర్ లీకేజీ కారణంగా గతంలో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన టీఎస్​పీఎస్సీ.. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 994 సెంటర్లలో మళ్లీ ఎగ్జామ్ నిర్వహించింది. అయితే ఈసారి అటెండెన్స్ పర్సంటేజీ భారీగా తగ్గింది. ప్రిలిమ్స్ కు మొత్తం 3,80,181 మంది దరఖాస్తు చేసుకోగా.. గత అక్టోబర్ లో నిర్వహించిన పరీక్షకు 2.80 లక్షల మంది హాజరయ్యారు. కానీ ఈసారి 2,33,248 (61.37%) మంది మాత్రమే హాజరయ్యారు. ఇక ఈసారి కూడా క్వశ్చన్ పేపర్ టఫ్ గా వచ్చిందని అభ్యర్థులు తెలిపారు.  కరెంట్ అఫైర్స్ లో సివిల్స్ స్థాయిని మించి ప్రశ్నలు వచ్చినట్టు చెప్పారు. ‘‘పాలిటీలో తక్కువ క్వశ్చన్లు వచ్చాయి. కొన్ని క్వశ్చన్లు లెన్తీగా ఉండడంతో, వాటిని అర్థం చేసుకునేందుకు టైమ్ ఎక్కువ వేస్ట్ అయింది” అని పేర్కొన్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా కటాఫ్ మార్కులు 65 నుంచి 80 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 

ఏర్పాట్లు డొల్ల...  

పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తామని ప్రకటించిన టీఎస్​పీఎస్సీ.. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. గతంలో అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోగా, ఈసారి ఆ విధానమే కనిపించలేదు. ఓఎంఆర్​షీట్ లో అభ్యర్థి ఫొటో, వివరాలేవీ లేకపోవడంతో.. ఒకరికి బదులు మరొకరు ఈజీగా పరీక్ష రాయొచ్చనే వాదనలు వినిపించాయి. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట దాకా ఎగ్జామ్ నిర్వహించగా.. ఉదయం 10:15 గంటల లోపు వచ్చిన వారినే లోపలికి అనుమతించారు. రెండు, మూడు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అభ్యర్థులను సెంటర్లలోకి అనుమతించలేదు. కొన్ని సెంటర్లలో సిబ్బంది అత్యుత్సాహంతో ఆడవాళ్ల చేతుల గాజులు, చెవి రింగులు తొలగించారు. మగవాళ్ల గడియారాలు, కంకణాలు తీయించారు.  

కొన్నిచోట్ల ఆలస్యంగా ఎగ్జామ్.. 

  • హైదరాబాద్ దగ్గర్లోని ఘట్కేసర్ లో ఏసీ ఇంజినీరింగ్ కాలేజీలోని సెంటర్​లో 15 నిమిషాలు ఆలస్యంగా పేపర్ ఇచ్చారు. సిబ్బంది ఉదయం 10:30 కంటే ముందే చేయాల్సిన పనులన్నీ.. ఆ తర్వాత చేశారు. దీంతో అభ్యర్థులు అదనపు టైమ్ ఇవ్వాలని కోరినా అధికారులు వినలేదు. 
  • జగిత్యాలలోని గౌతమ్ హైస్కూల్​లో మగవాళ్ల చేతికున్న కంకణాలు, గడియారాలు.. ఆడవాళ్ల గాజులు, చెవి రింగులు తీసివేయించారు. 
  • నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాకతీయ మహిళా జూనియర్ కాలేజీ సెంటర్ కు క్వశ్చన్ పేపర్లు తక్కువ రావడంతో.. పక్కనున్న సెంటర్ నుంచి తెప్పించి అభ్యర్థులకు అందించారు. దీంతో పరీక్ష 14 నిమిషాలు ఆలస్యం కాగా, అభ్యర్థులకు అదనపు టైమ్ కేటాయించారు. 
  • హైదరాబాద్ మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ ఉమెన్స్ కాలేజీలో సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని అభ్యర్థులు ఆరోపించారు. ఇన్విజిలేటర్స్ మొబైల్స్ తో వచ్చారని, సరిగా ఎవరినీ చెక్ చేయలేదని చెప్పారు.  

    

సిద్దిపేట పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ సెంటర్ లో ఓ అభ్యర్థి ఓఎంఆర్ షీట్ లో హాల్ టికెట్ నంబర్ తప్పుగా బబ్లింగ్ చేశాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకుండా టాయ్ లెట్ కు వెళ్తానని చెప్పి.. క్వశ్చన్ పేపర్ ఇవ్వకముందే సెంటర్ నుంచి బయటకొచ్చాడు. ఇన్విజిలేటర్ పోలీసులకు చెప్పడంతో ఆ అభ్యర్థిని అరెస్టు చేశారు. 

అప్లై చేయకున్నా హాల్ టికెట్ 

నిజామాబాద్, వెలుగు: గ్రూప్​1 ప్రిలిమ్స్ కు అప్లై చేయకున్నా తనకు హాల్​టికెట్​వచ్చిందని నిజామాబాద్​జిల్లా ఆర్మూర్​కు చెందిన సుచిత్ర అనే యువతి తెలిపింది. తాను గ్రూప్​3, 4 జాబ్స్ కోసం అప్లై చేసుకున్నానని.. కానీ శనివారం గ్రూపు-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్​టికెట్ డౌన్​లోడ్​చేసుకోవాలంటూ తన ఫోన్​కు మెసేజ్​ వచ్చిందని ఆమె చెప్పింది. దీంతో ఇంటర్​నెట్ సెంటర్​కు వెళ్లి టీఎస్ పీఎస్సీలో వెబ్ సైట్ లో చెక్ చేయగా, హాల్​టికెట్ కూడా డౌన్​లోడ్​అయిందని పేర్కొన్నారు. లోకల్​గా ఉన్న ఆర్​బీవీఆర్​స్కూల్​లో సెంటర్​పడిందన్నారు. కాగా ఈ ఘటనపై ఎంక్వైరీ చేయాలని సుచిత్ర తండ్రి, లాయర్ శ్రీధర్ ఆఫీసర్లను కోరారు.