ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వలస ఓటర్లపై అభ్యర్థుల ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వలస ఓటర్లపై అభ్యర్థుల ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
  • ఓటు వేసేందుకు రావాలంటూ ఫోన్లు, కొందరు అభ్యర్థులైతే హైదరాబాద్ వెళ్లి ప్రచారం 
  • ప్రయాణం, భోజనం ఖర్చులు భరిస్తామంటూ ఆఫర్లు
  • ఉమ్మడి జిల్లాలో ప్రతి గ్రామం నుంచి ఉద్యోగ, ఉపాధి కోసం వలసలు
  • గతంలో తక్కువ మెజారిటీతో ఓడిపోయిన అనుభవంతో..
  • ప్రతి ఓటు కీలకమన్న భావనలో అభ్యర్థులు 

జగిత్యాల, వెలుగు:  గ్రామ పంచాయతీ ఎన్నికలు నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాల్లో సందడి నెలకొంది. రచ్చబండల దగ్గర చర్చలు, దుకాణాల ముందే రాజకీయ వాదనలు, ఇంటింటి ప్రచారాలతో పల్లె వాతావరణం వేగంగా మారుతోంది. పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటు కీలకంగా మారింది. గతంలో ఒక్క ఓటు తేడాతో సర్పంచ్ కుర్చీ చేజారిన అనుభవాలు ఉండటంతో అభ్యర్థులు ప్రతి ఓటుపై ఫోకస్ చేస్తున్నారు. 

ఈక్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వలస వెళ్లిన యువతను రప్పించి ఓటు వేయించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణ, భోజన ఖర్చులతోపాటు నజరానాలు కూడా ఇస్తామంటూ ఆఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఫోన్​నంబర్లు సేకరించి మరీ పలకరిస్తూ ఓటేసేందుకు రావాలని అభ్యర్థిస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 3 లక్షలకు పైగా వలస ఓటర్లు

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 18,72,326 మంది ఓటర్లు ఉన్నారు. జగిత్యాల జిల్లాలో 385 జీపీల పరిధిలో 6,07,263 మంది ఓటర్లు, కరీంనగర్ జిల్లాలో 318 జీపీల్లో 5,07,531 మంది ఓటర్లు, పెద్దపల్లి జిల్లాలో 263 జీపీల్లో 4,04,181, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 జీపీలు - 3,53,351 ఓటర్లున్నారు. 

వీరిలో సుమారు 3 లక్షలకుపైగా ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నట్లు అభ్యర్థులు, స్థానిక నేతలు అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా కావడంతో వలస ఓటర్లను రప్పించేందుకు ప్రయత్నాలులు ముమ్మరం చేశారు. తొలి విడత ఎన్నికలు రేపు జరగనుండడంతో నేటి నుంచే ఇతర ప్రాంతాల ఓటర్లు సొంత గ్రామాల బాటపట్టనున్నారు. 

పట్టణాలకు విస్తరించిన ప్రచారం

ఉమ్మడి జిల్లాల నుంచి వలస వెళ్లిన వారిలో ఆధికంగా హైదరాబాద్, ముంబయి, భీవండి, పూణే, బెంగళూరులాంటి నగరాల్లో పని చేస్తున్నారు. గ్రామాల్లోనే ప్రచారం చేయడంతోపాటు అభ్యర్థులు స్వయంగా పట్నాల దాకా వెళ్లి కాలనీల్లో చిన్న సమావేశాలు పెట్టి వలస ఓటర్లను కలుస్తున్నారు. 

కలవలేని వారికి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ చేస్తూ ఓటు వేయాలని వేడుకుంటున్నారు. కొన్ని చోట్ల ప్రయాణ ఖర్చులు, వాహనాల ఏర్పాట్లు, భోజనం వరకు భరిస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వలస కార్మికుల సంఖ్య కూడా ఉమ్మడి జిల్లాలో ఎక్కువే. వారికి స్థానికంగా ఉన్న కుటుంబ సభ్యులు, బంధువుల ద్వారా ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేయించి ఓటు కోసం బుజ్జగిస్తున్నారు.