- ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం విఫలమైంది : ప్రొ.కోదండరాం
- న్యాయం జరిగే దాకా అండగా ఉంటాం : అద్దంకి దయాకర్
ఖైరతాబాద్, వెలుగు: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించకుంటే హైదరాబాద్‌ను దిగ్బంధిస్తామని అభ్యర్థుల పోరాట సమితి హెచ్చరించింది. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు తెలంగాణ జన సమితి స్టేట్ ప్రెసిడెంట్ ప్రొ.కోదండరాం చీఫ్ గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. టీఎస్ఎల్పీఆర్బీ చర్యలు కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఫిజికల్ ఈవెంట్స్ సరిగ్గా నిర్వహించలేదని ఆరోపించారు. ఆర్మీ రిక్రూట్మెంట్లోనే లేని నిబంధనలు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు పెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభ్యర్థులకు న్యాయం జరిగే దాకా అండగా ఉంటామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ భరోసా ఇచ్చారు. జాబ్ నోటిఫికేషన్ పేరుతో ఎన్నికలకు పోవాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారన్నారు. ప్రిలిమ్స్ లో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎన్.బాల మల్లేశ్ డిమాండ్ చేశారు. బోర్డు చైర్మన్‌ను బర్తరఫ్ చేయాలన్నారు. అభ్యర్థుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని అరుణోదయ సాంస్కృతిక నేత విమలక్క డిమాండ్ చేశారు. రన్నింగ్ లో అర్హత సాధించిన వారందరికీ మెయిన్స్ పరీక్షకు చాన్స్ ఇవ్వాలన్నారు. పోలీసు రిక్రూట్మెంట్లో భాగంగా అభ్యర్థులు చనిపోయారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ డి.సుధాకర్ ఆరోపించారు.
ప్రెస్‌క్లబ్‌లో మెరుపు ధర్నా
తమకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే దాకా ఇక్కడి నుంచి కదిలేది లేదని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోనే సదస్సు తర్వాత అభ్యర్థులు బైఠాయించారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, దయచేసి సహకరించాలని కోరారు. అభ్యర్థులు ఎంతకీ మాట వినకపోవడంతో వారిని అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు డీజీ.నర్సింగ్ రావు, పోరాట సమితి కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు వలీ ఉల్లా ఖాద్రీ, ధర్మేంద్ర (ఏఐవైఎఫ్), కోట రమేశ్, వెంకటేశ్ (డీవైఎఫ్ఐ), సలీం పాషా (యువజన జన సమితి), రెహమాన్, లక్ష్మణ్, ఉదయ్ (ఏఐఎస్ఎఫ్), అశోక్ రెడ్డి (ఎస్ఎఫ్ఐ), పీడీఎస్‌యూ (విజృంభణ) విజయ్, శివానంద్, అమరేందర్ (టీఎన్ఎస్ఎఫ్), భీమ్ రావు, శ్రీకాంత్ (నిరుద్యోగ జాక్)తో పాటు దాదాపు 200 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.
ప్రగతి భవన్ ను ముట్టడించిన బీజేవైఎం లీడర్లు
పోలీస్ నియామకాల్లో కేసీఆర్ ప్రభుత్వ తుగ్లక్ నిర్ణయాలతో లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేవైఎం ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ అన్నారు. గురువారం నిర్వహించిన ప్రగతి భవన్ ముట్టడిలో పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేసి ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు తరలించారని పేర్కొన్నారు. ఏ రాష్ర్టంలో లేనివిధంగా తెలంగాణలో నాలుగు మీటర్ల లాంగ్ జంప్, ఆరు మీటర్ల షార్ట్‌పుట్ పెట్టి అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని విమర్శించారు.

