- సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట
- కేసులో 19 మందికి నోటీసులు జారీ
- 11వ నిందితుడిగా అల్లు అర్జున్.. బౌన్సర్లు, మేనేజర్లపై అభియోగాలు
- 56 మంది సాక్షుల వాంగ్మూలాలతో 112 పేజీల చార్జ్‌షీట్
హైదరాబాద్, వెలుగు: సినీ నటుడు అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశింది. అల్లు అర్జున్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న థియేటర్ మేనేజ్మెంట్‌కు చెందిన10 మంది సహా మొత్తం 19 మంది నిందితులకు సమన్లు జారీ చేసింది. కేసు ట్రయల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో నిందితులంతా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల్సి ఉంది. 2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెన్‌ఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎంలో తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో ఆయనను చూసేందుకు అభిమానులు ఒక్కసారిగా ఎగబడడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి(35) అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం, అనుమతి లేకుండా అల్లుఅర్జున్ వచ్చి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించాడని చిక్కడపల్లి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2024 డిసెంబర్ 13న అల్లుఅర్జున్‌ను అరెస్ట్ చేశారు.
సీసీటీవీ ఫుటేజ్‌లు సహా 56 మంది సాక్షులు
సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, తొక్కిసలాట సమయంలో అల్లు అర్జున్ అక్కడే ఉన్నట్టు కోర్టుకు పోలీసులు ఆధారాలు అందించారు. దర్యాప్తు అనంతరం తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సహా 56 మంది సాక్షుల వాంగ్మూలాలతో మొత్తం112 పేజీల చార్జ్‌షీట్‌ను డిసెంబర్ 24న నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. రేవతి మృతికి సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ థియేటర్ మేనేజ్మెంట్‌కు చెందిన10 మందిపై,11వ నిందితుడిగా అల్లుఅర్జున్ ఆయన మేనేజర్లు, బౌన్సర్లు, థియేటర్ టెక్నికల్ అసిస్టెంట్లు సహా మొత్తం 23 మందిపై అభియోగాలు మోపారు. చార్జిషీట్‌ను కోర్టు పరిశీలించిన అనంతరం కోర్టు విచారణకు స్వీకరించింది. నిందితులకు సమన్లు జారీ చేసింది.
