కానిస్టేబుల్ పరీక్ష మెరిట్ లిస్ట్ ను విడుదల చేయండి

కానిస్టేబుల్ పరీక్ష మెరిట్ లిస్ట్ ను విడుదల చేయండి

కానిస్టేబుల్ అర్హత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల ఫైనల్ పరీక్ష ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం ముందు అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. 2018లో కానిస్టేబుల్ నియామక పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ వేసిందని, 16 వేల పోస్టులకు గాను 90వేల మంది అభ్యర్థులు ఆ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించారని వారు తెలిపారు.

2019 ఏప్రిల్ లోనే పరీక్షకు సంబందించిన ఫలితాలు వచ్చాయని, ఫలితాలు వచ్చి ఐదు నెలల గడుస్తున్నా ఇప్పటివరకు మెరిట్ లిస్ట్ ను ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక మంది నిరుద్యోగులు ఈ లిస్ట్ కోసం ఎదురుచూస్తున్నారని, ఎన్ని సార్లు డిజిపి కార్యాలయం చుట్టూ తిరిగిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నగరంలో హాస్టల్ లలో ఉంటూ కోచింగ్ లకు డబ్బులు వెచ్చించలేక నిరుద్యోగులైన తాము దుర్భర జీవితం గడుపుతున్నామని తెలిపారు.

ఉన్నతాధికారులు ఇప్పటికైనా మెరిట్ లిస్ట్ ప్రకటిస్తే … మిగిలిన అభ్యర్థులు వేరే ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి వీలవుతుందని వారు తెలిపారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో డీజీపీ కార్యాలయం ముందు ఆందోళన దిగడంతో పోలీసులు వారిని అక్కడి నుండి పంపించేశారు.