
- ఎదురుచూపుల్లో 16 వేల మంది ఉద్యోగులు
- 2003 డిసెంబర్ 22 నాటికి నియామకమైన వారికి వర్తింపు
- ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలంటున్న ఉద్యోగులు
మంచిర్యాల, వెలుగు: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీం(ఓపీఎస్) అమలు చేయాలని ఏండ్ల తరబడి పోరాడుతున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులను కూడా రాష్ట్ర సర్కారు అమలు చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేల మంది ఉద్యోగులు, టీచర్లు ఓపీఎస్‌కు అర్హత కలిగి ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర అన్యాయం జరుగుతోంది. 2004 జనవరి 1 నుంచి సీపీఎస్అమల్లోకి రాగా దీనికి సంబంధించి 2003 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటికే వివిధ డిపార్ట్మెంట్లలో జాబ్ నోటిఫికేషన్లు వచ్చి, ఉద్యోగుల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ పలు కారణాల వల్ల నియామకాలు నిలిచిపోయాయి. తర్వాత సంవత్సరం అపాయింట్మెంట్ ఆర్డర్స్రావడంతో ఉద్యోగులు వారి పోస్టుల్లో జాయిన్ అయ్యారు. అప్పటికే సీపీఎస్అమల్లోకి రావడంతో వారికి కూడా అదే స్కీంను వర్తింపచేశారు. సీపీఎస్‌తో నష్టం జరుగుతోందని, తమకూ ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాలని వారంతా ప్రభుత్వానికి విన్నవించారు. వారి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 2020 ఫిబ్రవరి 17న మెమో నంబర్ 57 ద్వారా వారికి ఓల్డ్ పెన్షన్ వర్తింపచేయాలని ఆర్డర్స్జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓపీఎస్‌కు అర్హులైన ఉద్యోగులు, టీచర్ల జాబితాను సేకరించినప్పటికీ ఇంతవరకు దానిని అమలు చేయలేదు. దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా కేంద్రం ఆదేశాలను అమలు చేయడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈసారైనా అమలు చేసేనా?
సీపీఎస్ నోటిఫికేషన్ ఇచ్చేనాటికి నియామక ప్రక్రియ పూర్తయి తర్వాత సంవత్సరం అపాయింట్మెంట్అయిన వారికి సైతం ఓల్డ్‌పెన్షన్ వర్తింపచేయాలని మినిస్ట్రీ ఆఫ్పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్అండ్పెన్షన్స్డిపార్ట్మెంట్ఈ నెల 3న ఆర్డర్స్జారీ చేసింది. ఇందుకుగాను ఈ ఏడాది ఆగస్టు 31 వరకు గడువు విధించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ఎంప్లాయీస్ కాకుండా రాష్ట్రంలోని సుమారు 16 వేల మంది ఉద్యోగులు, టీచర్లు ఓల్డ్ పెన్షన్‌కు అర్హత పొందారు. వారి జాబితా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండడంతో వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
వెంటనే అమలు చేయాలి
2004 జనవరి 1 నుంచి సీపీఎస్ అమల్లోకి వచ్చింది. అంతకుముందే జాబ్ నోటిఫికేషన్ వచ్చి, నియామక ప్రక్రియ పూర్తయిన వారికి ఓల్డ్ పెన్షన్ స్కీంను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను అమలు చేయడం లేదు. దీంతో సుమారు 16 వేల మంది ఉద్యోగులు, టీచర్లకు నష్టం జరుగుతోంది. ఇప్పటికైనా స్పందించి వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీంను వర్తింపచేయాలి.
- బండి రమేష్, తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి