కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా దేవునిపల్లిలో శనివారం సిలిండర్ నుంచి వాహనంలో గ్యాస్ నింపుతుండగా ట్యాంక్ పేలి నాలుగు వాహనాలు దగ్ధమయ్యాయి. స్థానికుల వివరాల ప్రకారం దేవునిపల్లికి చెందిన శ్రీశైలం తన ఇంటి వద్ద రెండు వ్యాన్లలో సిలిండర్ నుంచి గ్యాస్ నింపిన అనంతరం మరో కారులో గ్యాస్ నింపుతున్న సమయంలో అకస్మాత్తుగా ట్యాంక్ పేలింది. దీంతో మంటలు చెలరేగి అక్కడే ఉన్న రెండు వ్యాన్లతో పాటు పక్కన ఉన్న సురేశ్‌కు చెందిన కారు, బైక్ కాలిపోయాయి. భారీ శబ్ధంతో మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళన చెందారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
