తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ హాస్టల్ బాధ్యత కేర్టేకర్లదే

తెలంగాణ  రాష్ట్రంలోని  మోడల్  స్కూల్ హాస్టల్ బాధ్యత కేర్టేకర్లదే
  • కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లను తప్పించిన విద్యా శాఖ
  • సమగ్ర శిక్ష ఎస్​పీడీ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్  స్కూళ్లకు అనుబంధంగా ఉన్న బాలికల హాస్టళ్ల నిర్వహణలో విద్యా శాఖ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఈ హాస్టళ్ల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లుగా వ్యవహరిస్తున్న కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ మేరకు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్  డైరెక్టర్ నవీన్ నికోలస్  ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన వర్చువల్  మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చర్చించిన అంశాల ఆధారంగా కొత్త రూల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించారు. 

ఇకపై మోడల్  స్కూల్స్ గర్ల్స్ హాస్టళ్ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను అక్కడి కేర్​టేకర్లదేననీ, వారిని ఇకనుంచి  కేర్​టేకర్​ కమ్ -వార్డెన్​గా పిలవాలన్నారు. మోడల్  స్కూల్  హాస్టల్  నిర్వహణకు సంబంధించిన జాయింట్  బ్యాంక్  అకౌంట్ల విషయంలోనూ మార్పులు చేశారు. గతంలో డీపీవో అకౌంట్స్ ఆఫీసర్, కేజీబీవీ ఎస్ఓల పేరిట అకౌంట్  ఉండేది. 

ఇకపై డీపీఓ ఫైనాన్స్  ఆఫీసర్, మోడల్  స్కూల్  హాస్టల్  వార్డెన్ (కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టేకర్) పేరిట జాయింట్ అకౌంట్  ఉంటుంది. నిధుల వినియోగం వీరి ఆధ్వర్యంలోనే జరుగుతుంది. మైనర్  రిపేర్ల కోసం కేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టేకర్  -కమ్  -వార్డెన్, మోడల్  స్కూల్  ప్రిన్సిపాల్, మండల విద్యాధికారి, జిల్లా జెండర్ అండ్  ఈక్విటీ కో-ఆర్డినేటర్ తో కూడిన సభ్యుల కమిటీ వేయాల్సి ఉంటుంది. ఈ కమిటీ తనిఖీలు చేసి అన్ని మైనర్  రిపేర్లను చేపట్టనున్నారు. 

వంట మనిషే.. క్లీనింగ్ చేయాలి 

హాస్టళ్లలో పనిచేసే కుక్స్ ఇకపై మల్టీపర్పస్ వర్కర్లుగా పనిచేయాలని ఆఫీసర్లు తేల్చిచెప్పారు. ఉన్న ముగ్గురు కుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఒకరు రొటేషన్ పద్ధతిలో హాస్టల్ క్లీనింగ్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. హాస్టల్ బయట ఆవరణ, పిచ్చిమొక్కల తొలగింపు బాధ్యతను మోడల్ స్కూల్  ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ (ఏఏపీసీ) పారిశుధ్య కార్మికులకు అప్పగించారు. హాస్టళ్లలో సమస్యలు తెలుసుకునేందుకు ఎంఈఓలు, జెండర్  కో-ఆర్డినేటర్లు  15 రోజులకోసారి విజిట్  చేయాలని అధికారులు ఆదేశించారు. 

జిల్లా విద్యా శాఖ అధికారులు రాబోయే 15 రోజుల్లో జిల్లాలోని అన్ని మోడల్ స్కూల్  హాస్టళ్లను తనిఖీ చేసి రిపోర్టు ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే 9, 10, 11, 12వ తరగతి స్టూడెంట్లతో ఫుడ్ కమిటీలు వేయాలని, సరుకులు, మెనూ నిర్వహణపై వాళ్లు సంతకం చేశాకే బిల్లులు పెట్టాలని సూచించారు.