V6 News

డిగ్రీ కాలేజీల్లో సీఏఎస్ ప్రమోషన్ల రచ్చ..జేఎల్ సర్వీస్ లెక్కింపుపై డైరెక్ట్ రిక్రూటీల ఆందోళన

డిగ్రీ కాలేజీల్లో సీఏఎస్ ప్రమోషన్ల రచ్చ..జేఎల్ సర్వీస్ లెక్కింపుపై డైరెక్ట్ రిక్రూటీల ఆందోళన
  • మళ్లీ పాత సర్వీస్ కోసం ప్రమోటీ లెక్చరర్ల ప్రయత్నాలు 
  • ఇదే జరిగితే ప్రభుత్వ ఖజానాపై 
  • వందల కోట్ల భారం పడే ఛాన్స్

హైదరాబాద్-, వెలుగు: సర్కారు డిగ్రీ కాలేజీల్లో  కెరీర్ అడ్వాన్స్‌‌మెంట్ స్కీమ్ (సీఏఎస్) ప్రమోషన్ల అంశం ఆ శాఖలో తీవ్ర వివాదానికి దారితీస్తోంది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేని సర్వీసును లెక్కించి కొందరికి లబ్ధి చేకూరేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని డైరెక్ట్ రిక్రూటీ లెక్చరర్లు ఆరోపిస్తున్నారు. కానీ 20 ఏండ్ల కింద ఇచ్చారు కాబట్టి ఈసారి కూడా ఇవ్వాల్సిందేననీ ప్రమోటీ లెక్చరర్లు వాదిస్తున్నారు. ఇదే జరిగితే తమ సర్వీసుకు తీవ్ర అన్యాయం జరగడంతో పాటు రాష్ట్ర ఖజానాపై వందల కోట్ల భారం పడే అవకాశం ఉందని డైరెక్ట్ రిక్రూట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు చెప్తున్నారు. ఈ వివాదం సర్కారు దాకా పోవడంతో అక్కడా అయోమయం నెలకొన్నది. 

పాత జీవో.. కొత్త చిక్కులు

అసలు ఈ గొడవంతా 20 ఏళ్ల కింద జీవో చుట్టూ తిరుగుతోంది. 2004లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్10 ప్రకారం జూనియర్ లెక్చరర్ నుంచి డిగ్రీ లెక్చరర్‌‌గా ప్రమోషన్ పొందిన వారి గత సర్వీసును (ఎన్​-5/2 సూత్రం ప్రకారం) లెక్కించారు. దీని ప్రకారం 1986, 1996 పే స్కేల్​తో వారికి ప్రమోషన్లు దక్కాయి. అప్పట్లో కాంపోజిట్ కాలేజీల విలీనం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో ఆ జీవోను ఇచ్చారనే వాదనలు ఉన్నాయి.

ఈ క్రమంలో అప్పటి నుంచి  ఇప్పటి దాకా డిగ్రీ కాలేజీల్లో చాలా సార్లు ప్రమోషన్ల ప్రక్రియ జరిగింది. కానీ, జేఎల్ సర్వీసు తీసుకోకుండానే ఈ ప్రక్రియ పూర్తయింది. తాజాగా సర్కారులోని కొందరు పెద్దలపై  ప్రమోటీ లెక్చరర్లు ఒత్తిడి తీసుకొచ్చి.. మళ్లీ సీఏఎస్ ప్రమోషన్లలో జేఎల్ సర్వీస్ కలపాలని డిమాండ్ ను తెరమీదికి తీసుకొచ్చారు. దీనికి అనుగుణంగా కళాశాల విద్యాశాఖ అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు.

ఇది ఆ శాఖలో రచ్చ లేపింది. ప్రమోటీ లెక్చరర్లు, డైరెక్ట్  రిక్రూటీ లెక్చరర్ల మధ్య గొడవలకు దారి తీసింది. ఉదాహరణకు ఓ స్కూల్ అసిస్టెంట్ హెడ్మాస్టర్ గా ప్రమోషన్ పొందిన తర్వాత మళ్లీ పాత సర్వీస్ ను కలిపే విధానం ఉందా అంటూ డైరెక్ట్ రిక్రూటీలు ప్రశ్నిస్తున్నారు.  

యూజీసీ నిబంధన ఏం చెబుతోంది?

యూజీసీ నిబంధనల ప్రకారం.. అసిస్టెంట్ ప్రొఫెసర్‌‌గా సీఏఎస్ పదోన్నతి పొందాలంటే సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్/సెట్ లేదా పీహెచ్‌‌డీ  కలిగి ఉండడం తప్పనిసరి. కానీ జూనియర్ లెక్చరర్ పోస్టుకు కేవలం పీజీ ఉంటే సరిపోతుంది. నిబంధనల ప్రకారం ఒక పోస్టుకు ఉండాల్సిన కనీస విద్యార్హతలు లేని సర్వీసును, ఉన్నత స్థాయి పదోన్నతుల కోసం పరిగణనలోకి తీసుకోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని స్పష్టమవుతోంది.

ఇదే వాదనను డైరెక్ట్ రిక్రూటీలు చేస్తున్నారు. ఒకవేళ జేఎల్ సర్వీసును లెక్కిస్తే నేరుగా నియామకమైన అసిస్టెంట్ ప్రొఫెసర్లు తీవ్రంగా నష్టపోతారని పేర్కొంటున్నారు. దీనిద్వారా అధిక విద్యార్హతలతో డైరెక్ట్ రిక్రూట్‌‌మెంట్‌‌లో వచ్చిన వారు ప్రమోషన్ ద్వారా వచ్చిన వారి కంటే జూనియర్లుగా మారిపోయే ప్రమాదం ఉందని టీజీసీటీఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి. శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ బ్రిజేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీనియారిటీ మారిపోయి అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లుగా డైరెక్ట్ రిక్రూటీలు తక్కువ మంది అయ్యే చాన్స్​ ఉందని పేర్కొన్నారు. 

ఖజానాపై భారం..!

సీఏఎస్ లో పాత సర్వీస్ విధానం అమలు జరిగితే 2006, 2016 పే స్కేల్ తో వారికి లాభం చేకూరే అవకాశం ఉంది. వీరిలో చాలామంది రిటైర్డ్ అయ్యారు. వారితో పాటు సర్వీసులో ఉన్న వారికీ పాత బకాయిలన్నీ కట్టి ఇవ్వాల్సి ఉంటుంది. దీనిద్వారా ప్రభుత్వానికి భారీ ఆర్థిక భారం పడనుంది. జేఎల్ సర్వీసును సీఏఎస్ కోసం పరిగణనలోకి తీసుకోవాలనే ప్రతిపాదనను రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే రెండుసార్లు తిరస్కరించినట్లు అధికారులే చెప్తున్నారు.

పాత సర్వీస్ విధానంతో పదోన్నతి పొందిన ఒక్కో లెక్చరర్​కు నెలకు రూ.50 వేల వరకు అదనపు వేతనం లభిస్తుంది. అంటే ఏడాదికి ఒక్కొక్కరికి రూ. 6 లక్షల మేర లబ్ధి చేకూరుతుంది. ఇలా ప్రభుత్వంపై వందల కోట్ల భారం పడే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం ఇది చెల్లదని అయినా కొందరు మళ్లీ పైరవీలు చేస్తూ ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని డైరెక్ట్ రిక్రూటీలు ఆరోపిస్తున్నారు. దీనిపై సర్కారుకు లేఖ రాసినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు వెలుగుతో చెప్పారు.