న్యూఢిల్లీ: టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా సోషల్‌మీడియా ‘ఎక్స్’ లో చేసిన ఒక పోస్ట్ మహిళల ఆత్మాభిమానానికి భంగం కలిగించేలా ఉందంటూ ఆమెపై కేసు నమోదైంది. జాతీయ మహిళా కమిషన్(ఎన్డబ్ల్యూసీ) చైర్పర్సన్ రేఖా శర్మ ఫిర్యాదు మేరకు మోయిత్రాపై భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 79 (మహిళలను కించపరిచే చర్య) కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హత్రాస్ తొక్కిసలాటలో మరణించిన 121 మంది మహిళల కుటుంబాలు, ఇతర బాధితులను రేఖా శర్మ ఇటీవల పరామర్శించారు.
ఈ సందర్భంగా పర్యటన ఆసాంతం ఒక ఆఫీసర్ఆమెకు గొడుగు పట్టుకొని వెనకే నడిచాడు. ‘‘గొడుగు ఆమెనే ఎందుకు పట్టుకోకూడదు’’ అంటూ ఒక జర్నలిస్టు ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. మొయిత్రా దీనికి రిప్లై ఇస్తూ ‘‘పైజామా” అనే పదాన్ని వాడుతూ కామెంట్ చేశారు. అది వివాదాస్పదం కావడంతో మొయిత్రా ‘‘పైజామా’’ కామెంట్‌ను తొలగించారు. ఈ క్రమంలోనే మొయిత్రాపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎస్సీడబ్ల్యూ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు సూచించింది.
