- అత్తాపూర్‌లోని స్వీట్‌హౌస్‌పై కేసు
గండిపేట, వెలుగు: ఫంగస్ వచ్చిన స్వీట్లు అమ్మడంతో అత్తాపూర్‌లోని హల్దీ రామ్స్ స్వీట్‌హౌస్‌పై కేసు నమోదైంది. శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన కొత్తగిరి సిద్ధార్థ అత్తాపూర్‌లోని హల్దీరామ్స్ షాప్‌కు వెళ్లి స్వీట్లు, సమోసాలు కొనుగోలు చేశాడు. బాక్స్‌లోని స్వీట్లు బూజు పట్టి ఉన్నాయని గమనించి మేనేజర్‌ను ప్రశ్నించాడు. దీంతో తనపై హల్దీరామ్స్ యాజమాన్యం దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, తమ బ్రాంచీలు దేశవ్యాప్తంగా ఉన్నాయని ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించారని బాధితుడు వాపోయాడు.
స్వీట్లను వీడియో తీస్తున్న తన సోదరిపై కూడా దాడి చేశారని అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వీట్స్‌ను టెస్టింగ్కోసం ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
