గచ్చిబౌలి, వెలుగు: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ రివాల్వర్తో బెదిరించాడంటూ ఆయన అల్లుడు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్ తన కుమార్తెను పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ కొడుకు అభిషేక్గౌడ్కు ఇచ్చి 14 ఏండ్ల క్రితం వివాహం చేశారు. మణికొండ పంచవటీ కాలనీలోని తన ఇంటిని కూతురు అల్లుడు ఉండేందుకు ఇచ్చాడు.
కొన్నాళ్ల తరువాత అభిషేక్‌గౌడ్ మరో ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. ప్రభాకర్ ఇచ్చిన ఇంటిని కృష్ణ ధర్మ పరిషత్ ఆఫీసుకు ఇచ్చాడు. ఇందులో అభిషేక్‌గౌడ్ మామ వెంకటేశ్‌గౌడ్, రాముయాదవ్ రూ.కోటి ఖర్చు చేసి ఇంటీరియర్ వర్క్ చేయించారు. అభిషేక్గౌడ్కు తన భార్యతో వివాదాలు ఏర్పడి ఏడాది కాలంగా దూరంగా ఉంటున్నారు. దీంతో తాను ఇచ్చిన ఇంటిని కేఈ ప్రభాకర్ తిరిగి తీసుకున్నాడు. అయితే, ఇంటీరియర్ కోసం తాము పెట్టిన డబ్బులు ఇవ్వడం లేదని వెంకటేశ్ గౌడ్, రాముయాదవ్ అక్టోబర్ 24న ఇంటికి తాళం వేశారు.
మరుసటి రోజు దీనిపై మాట్లాడుకునేందుకు ఇరు వర్గాలు పంచవటీ కాలనీలో కలుసుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. కేఈ ప్రభాకర్ తమను రివాల్వార్‌తో బెదిరించాడని వెంకటేశ్‌గౌడ్ వర్గం, తమనే వెంకటేశ్‌గౌడ్ వర్గం బెదిరించిందని కేఈ ప్రభాకర్ వర్గం పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. విచారణ జరిపిన పోలీసులు రివాల్వర్తో బెదిరింపులు లేవని తేల్చారు.
