మీర్‌పేట్, వెలుగు: గణేశ్ నిమజ్జనోత్సవాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సైతో అసభ్యకరంగా ప్రవర్తించడంతోపాటు విధులకు ఆటంకం కలిగించాడనే ఆరోపణలపై ఫిట్‌నెస్ క్లబ్ యజమానిపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేశారు. మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 23న అర్ధరాత్రి దాటిన తర్వాత అల్మాస్‌గూడ కమాన్ వద్ద శ్లోకా స్కూల్ సమీపంలో కొందరు వ్యక్తులు మద్యం మత్తులో డ్యాన్సులు చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్నట్లు మహిళా ఎస్సై గుర్తించారు.
రాత్రి సమయం కావడంతో అక్కడి నుంచి వెళ్లిపోవాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా వారిలో ఒకరు అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు విధులు నిర్వహించకుండా అడ్డుకున్నట్లు మహిళా ఎస్సై ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తిని ఆక్సిజన్ ఫిట్‌నెస్ క్లబ్ యజమాని సాకేత్ కుమార్‌గా గుర్తించి కేసు నమోదు చేసినట్లు మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ బండారి శోభన్ తెలిపారు.
