సీఐని దూషించిన కేసు : ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు

సీఐని దూషించిన కేసు : ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు

హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ సీఐ శివచంద్రను దూషించారని ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై బుధవారం (నవంబర్ 22న) పోలీసు స్టేష‌న్‌లో కేసు నమోదైంది. డ్యూటీలో ఉన్న సీఐని దుర్భాషలాడారని సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో 353,506,153a,505(2) IPC,125 RP సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

మంగ‌ళ‌వారం (నవంబర్ 21న)  రాత్రి ల‌లితాబాగ్‌లో ప్రచారం నిర్వహిస్తున్న స‌మయంలో త్వరగా ముగించాలని సంతోష్ నగర్ సీఐ శివచంద్ర.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు సూచించారు. ఆ స‌మ‌యంలో విధుల్లో ఉన్న పోలీసు ఆఫీస‌ర్‌పై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇంకా ఐదు నిమిషాల సమయం ఉంది.. మీరు అప్పుడే ఎలా వారిస్తారంటూ సీఐపై సీరియస్ అయ్యారు అక్బరుద్దీన్. నా దగ్గర కూడా వాచ్ ఉంది.. నన్ను ఆపడం కోసం ఎవరు ఇంకా పుట్టలేదు.. ఇంకా మాట్లాడుతా .. ఎవరూ నన్ను ఆపలేరు అంటూ చిందులేశారు. చాంద్రాయణగుట్ట ప్రజలారా చెప్పండి.. సైగ చేస్తే పరుగులు పెట్టాలి.. పరుగులు పెట్టిదామా..?  నేను అలసిపోయాను అనుకుంటున్నారు.. మన పని అయిపోయిందని అనుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీతో వీళ్లు పోటీ చేయడానికి వస్తున్నారు.. రానీయండి.. వాళ్లు గెలుస్తారో మనమో చూద్దాం.. అంటూ మాట్లాడారు.