నిరసనలో ప్రధానిపై కామెంట్లు.. యువతిపై కేసు నమోదు..నిరసనకారులపై కేసులు కరెక్ట్ కాదు: సీజేపీ

నిరసనలో ప్రధానిపై కామెంట్లు.. యువతిపై కేసు నమోదు..నిరసనకారులపై కేసులు కరెక్ట్ కాదు: సీజేపీ

న్యూఢిల్లీ: పేపర్ లీకేజీ నిరసన టైంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వివాదాస్పద కామెంట్లు చేసిన 25 ఏండ్ల రుచికా సింగ్ అనే యువతిని ఢిల్లీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. రుచికా వ్యాఖ్యలు ప్రధాని గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని, సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రమాదం ఉందని నోయిడాలోని ఎక్స్‌‌ప్రెస్‌‌వే పోలీస్ స్టేషన్‌‌కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు చేపట్టారు.

రుచికా సింగ్ పై బీఎన్‌‌ఎస్ చట్టంలోని సెక్షన్లు 352, 353(1), 356(1) కింద శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ప్రజల్లో అల్లర్లను రెచ్చగొట్టేలా మాట్లాడటం, పరువు నష్టం తదితర తీవ్రమైన అభియోగాలను మోపారు. ఎఫ్‌‌ఐఆర్‌‌ను పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌‌కు బదిలీ చేశారు. దీనిపై కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందించారు. ప్రధానిపై రుచికా సింగ్ ఉపయోగించిన భాష సరికాదన్నారు. అయితే, నిరసన తెలిపే వారిపై  క్రిమినల్ కేసులు పెట్టడం సరైన పద్ధతి కాదని అభిప్రాయపడ్డారు. 

కేవలం అభ్యంతరకర భాష వాడినంత మాత్రాన యువతిపై పోలీసు యంత్రాంగాన్ని ఉసిగొల్పడం, కేసులు పెట్టడం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేయవద్దని హితవు పలికారు.కాగా.. నిరసనలో అరెస్టయి, నేర చరిత్ర లేనివారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. నేర చరిత్ర ఉన్న వ్యక్తులపై మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది.