జూబ్లీహిల్స్, వెలుగు: హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు విధించిన డ్రోన్ నిషేధాజ్ఞలను ఉల్లంఘించినందుకు పలువురిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. మే 10న సాయంత్రం బసవతారకం హాస్పిటల్ జంక్షన్ వద్ద విజయ్ ముల్లంగి నాయకత్వంలో సుమారు 70 మంది పర్యావరణ ప్రేమికులు సోషల్ మీడియా ద్వారా ఒక్కచోట చేరి, చెట్లను నరికి అండర్ పాస్ లు వేయవద్దంటూ నిరసన చేపట్టారు.
అయితే, ఈ కార్యక్రమాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తుండగా గమనించిన పెట్రోలింగ్ పోలీసులు, నగరంలో హై అలర్ట్, డ్రోన్ ఆంక్షలు అమలులో ఉన్నందున వెంటనే అడ్డుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ఎగురవేసినందుకు కార్యక్రమ నిర్వాహకులతో పాటు ఇతరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
