సర్కార్ దవాఖాన్లలోనూ టెస్టులకు పైసలు...వైద్య సేవలకు చార్జీలు వసూలు

సర్కార్ దవాఖాన్లలోనూ టెస్టులకు పైసలు...వైద్య సేవలకు చార్జీలు వసూలు
  • ప్రభుత్వ మౌఖిక ఆదేశాలతోనే వసూలు!   
  • స్కానింగ్ లకు రూ.500 నుంచి 800 వరకు చార్జీలు  
  • యూజర్, డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్, ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ చార్జీలంటూ బాదుడు  
  • హైదరాబాద్ మొదలు జిల్లా ఆస్పత్రులకు వరకు అంతటా దోపిడీ
  • స్కానింగ్ లకు రూ.500 నుంచి 800 వరకు చార్జీలు
  • యూజర్, డెవలప్‌‌‌‌మెంట్, ఫిల్మ్‌‌‌‌ చార్జీలంటూ బాదుడు  
  • హైదరాబాద్ మొదలు జిల్లా ఆస్పత్రులకు వరకు అంతటా దోపిడీ  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖాన్లు ప్రైవేట్ గా మారుతున్నాయి. పూర్తి ఉచితంగా అందించాల్సిన వైద్య సేవలకు చార్జీలు వసూలు చేస్తున్నారు. సర్కార్ ఆదేశాలతోనే చార్జీల వసూలు మొదలైందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఏకైక కేన్సర్ హాస్పిటల్‌‌‌‌ ఎంఎన్‌‌‌‌జే మొదలుకుని.. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా హాస్పిటల్ వరకు చాలాచోట్ల టెస్టులకు డబ్బులు తీసుకుంటున్నారు. యూజర్, డెవలప్‌‌‌‌మెంట్, ఫిల్మ్‌‌‌‌ చార్జీల పేరుతో పేషెంట్ల నుంచి డబ్బులు గుంజుతున్నారు. కొన్ని చోట్ల హాస్పిటల్ డెవలప్‌‌‌‌మెంట్ సొసైటీ అని ముద్రించిన రసీదులు ఇస్తుండగా, ఇంకొన్ని దవాఖాన్లలో ఎలాంటి రసీదు లేకుండానే డబ్బులు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సీటీ, ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ లాంటి పెద్ద స్కాన్లకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలు కొన్ని హాస్పిటళ్లలో ఉండగా, మరికొన్ని హాస్పిటళ్లలో ఉచితంగా సేవలు కొనసాగుతున్నాయి. 

ఎంఎన్ జే ఆస్పత్రిలో ఎక్కువ... 

అత్యధికంగా ఎంఎన్‌‌‌‌జే దవాఖానలో సీటీ, ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ తదితర స్కాన్లకు రూ.500 నుంచి రూ.5 వేల వరకు చార్జ్ చేస్తున్నారు. అత్యల్పంగా నీలోఫర్‌‌‌‌‌‌‌‌లో రూ.300 తీసుకుంటున్నట్టు తెలిసింది. కొన్ని దవాఖాన్లలో అవుట్‌‌‌‌ పేషెంట్ల వద్ద మాత్రమే డబ్బులు వసూలు చేస్తుండగా, ఇంకొన్ని చోట్ల ఇన్‌‌‌‌పేషెంట్ల దగ్గర కూడా తీసుకుంటున్నారు. వైట్ రేషన్ కార్డు ఉంటే ఒక రేటు, లేకుంటే మరో లెక్కన చార్జ్ చేస్తున్నారు. మహబూబ్‌‌‌‌నగర్ జనరల్ హాస్పిటల్‌‌‌‌లో రేషన్ కార్డ్ లేకుంటే రూ.800, ఉంటే రూ.500 తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా హాస్పిటల్‌‌‌‌లో అవుట్ పేషెంట్ల వద్ద రూ.500 చొప్పున చార్జ్‌‌‌‌ చేస్తుండగా, వైట్ రేషన్ కార్డు ఉన్న ఇన్‌‌‌‌పేషెంట్లకు ఉచితంగా స్కానింగ్ చేస్తున్నారు. వైట్‌‌‌‌ రేషన్ కార్డు లేని ఇన్‌‌‌‌పేషెంట్ల వద్ద రూ.500 చార్జ్‌‌‌‌ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా హాస్పిటల్‌‌‌‌లో ఇటీవల సీటీ స్కానింగ్ ఫెసిలిటీ అందుబాటులోకి రాగా, ఒక్కో స్కాన్‌‌‌‌కు రూ.500 తీసుకుంటున్నారు. నిజామాబాద్ హాస్పిటల్‌‌‌‌లో గతంలో రూ.600 చొప్పున వసూలు చేశారు. అక్కడి సీటీ స్కాన్ యంత్రం పాడవడంతో, వారం కిందనే కొత్తది ఏర్పాటు చేశారు. ప్రస్తుతమైతే చార్జీలు తీసుకోవడం లేదని అక్కడి డాక్టర్లు తెలిపారు. ఇక నాగర్‌‌‌‌‌‌‌‌కర్నూల్ హాస్పిటల్‌‌‌‌లో గతేడాది సీటీ స్కాన్ యంత్రం తీసుకొచ్చి పెట్టిన అధికారులు.. దాన్ని ఇప్పటివరకు ఇన్‌‌‌‌స్టాల్ చేయించలేదు. 

ఎంఆర్ఐ సౌకర్యాలపై నిర్లక్ష్యం

ప్రభుత్వ దవాఖాన్లలో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని గొప్పగా చెబుతున్న సర్కార్.. పెద్ద పెద్ద దవాఖాన్లలో కూడా ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తేవడం లేదు. సూపర్‌‌‌‌‌‌‌‌స్పెషాలిటీ దవాఖానగా పేరున్న ఆదిలాబాద్‌‌‌‌ రిమ్స్​లో ఇప్పటివరకు ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ లేదు. వరంగల్ ఎంజీఎంలో నాలుగు నెలల నుంచి ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ మెషిన్ పని చేయడం లేదు. మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌, సిద్దిపేట, నిజామాబాద్ టీచింగ్ హాస్పిటళ్లు, కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలోనూ ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ సౌకర్యం లేదు. ఇటీవల మెడికల్ కాలేజీలుగా మారిన ఒక్క దవాఖానలోనూ ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ లేదు. టీచింగ్, జిల్లా హాస్పిటళ్లలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, పేషెంట్లను హైదరాబాద్‌‌‌‌కు రిఫర్ చేయొద్దని ప్రభుత్వం పదే పదే డాక్టర్లకు చెబుతూ వస్తోంది. తుంటి మార్పిడి వంటి పెద్ద సర్జరీలు కూడా జిల్లా హాస్పిటళ్లలో చేయాలని ఒత్తిడి చేస్తోంది. కానీ ఇందుకు అవసరమైన ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ వంటి పెద్ద యంత్రాలను మాత్రం ప్రభుత్వం అందుబాటులోకి తేవడం లేదని డాక్టర్లు ఫైర్ అవుతున్నారు. ఒకవేళ ఎవరికైనా ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ అవసరమైతే ప్రైవేటు హాస్పిటళ్లకు పంపించాల్సి వస్తోందంటున్నారు. ప్రైవేటు హాస్పిటల్స్‌‌‌‌లో ఎంఆర్‌‌‌‌‌‌‌‌ఐ స్కాన్‌‌‌‌కు రూ.5 వేల నుంచి 10 వేల వరకు చార్జ్ చేస్తున్నారు. 

కొత్త దవాఖాన్లలోనూ చార్జీలేనట!

వరంగల్‌‌‌‌లో మల్టీ సూపర్‌‌‌‌‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్, హైదరాబాద్‌‌‌‌లో 4 టిమ్స్ హాస్పిటళ్లు, నిమ్స్​లో కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ప్రభుత్వం బ్యాంకర్లు, ఇతర సంస్థల నుంచి భారీగా అప్పులు చేస్తోంది. ఈ అప్పులు తీసుకునేందుకు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ కూడా ఏర్పాటు చేసింది. అప్పులు తీర్చేందుకు వరంగల్, టిమ్స్ హాస్పిటళ్లను సైతం నిమ్స్‌‌‌‌ లాగే అటానమస్ సంస్థలుగా మారుస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిమ్స్‌‌‌‌ పేరుకు ప్రభుత్వ దవాఖాన అయినప్పటికీ, అక్కడ అన్ని రకాల వైద్య సేవలకూ చార్జీలు వసూలు చేస్తున్నారు. చేసిన అప్పులు తీర్చేందుకు, మెయింటెనెన్స్ కోసం టిమ్స్ హాస్పిటళ్లు, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌లోనూ నిమ్స్ తరహాలోనే పేషెంట్ల నుంచి భారీ ఎత్తున చార్జీలు వసూలు చేసే అవకాశం ఉందని వైద్యారోగ్యశాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అటానమస్ లేదా సెమి అటానమస్ హోదా ఇస్తే.. చార్జీలు వసూలు చేయడానికి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతుండడం ఆశ్చర్యంగా ఉంది.

స్కానింగ్​కు 800 తీసుకున్నరు.. 

నా భార్య ఫాతిమా బేగం మూడు నెలల కింద ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. కాలర్ బోన్ విరగడంతో పాటు తలకు గాయమైంది. మహబూబ్​నగర్ జనరల్ హాస్పిటల్ కి వెళ్లాం. అక్కడ సీటీ స్కాన్ కోసం రూ.800 తీసుకున్నారు. ఫ్రీ కదా? అని అడిగితే.. వాళ్లేం సమాధానం చెప్పలేదు. దీంతో రూ.800 చెల్లించి స్కానింగ్ చేయించాం.
– ఎండీ హైమద్, అమ్మాపూర్ గ్రామం, మహబూబ్‌‌‌‌నగర్ జిల్లా