లీడర్లకు క్యాష్ ప్రాబ్లమ్స్

లీడర్లకు క్యాష్ ప్రాబ్లమ్స్

వెలుగు: రాష్ట్ర రాజకీయ నేతలకు వరుస ఎన్నికలు ఆర్థిక కష్టాలను తెచ్చిపెట్టాయి. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు, మొన్న లోక్ సభ ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికల్లో ఉన్నదంతా ఖర్చు పెట్టిన నేతలు ఇప్పుడు పరిషత్ ఎన్నికలు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. ‘‘మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మీకోసం గల్లీ గల్లీ తిరిగాం. ఇప్పుడు మా కోసం మీరుఅంతో ఇంతో సాయం చేయాలి ” అంటూఎమ్మెల్యేల వద్దకు వెళ్లే పరిషత్ ఆశావహులకు చేదు అనుభవం ఎదురవుతోంది. ‘‘ఉన్నదంతా ఖర్సయిపోయింది. ఇంకాఎక్కడికెంచి తేవాలి” అని పెద్ద నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు.

ఖర్చు పెడితే గానీ గెలువలేమని..
అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం నియోజకవర్గాల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు ఎంతో కష్టపడ్డారు. అలా కష్టపెడితే సర్పంచ్, లేదా జడ్పీటీసీ, ఎంపీటీసీలుగా టికెట్లు దక్కుతాయని చాలా మంది ఆశించారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలువురు సర్పంచ్ లుగా గెలుపొందారు. మరికొంత మంది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కోసం ఎదురుచూశారు. ఇప్పుడు పరిషత్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో.. పోటీకి స్థానిక నేతలు సిద్ధమవుతున్నారు. పార్టీ ఏదైనా క్షేత్రస్థాయిలో పరిస్థితిని బట్టి భారీగా ఖర్చుపెట్టాల్సిందేనని నేతలు భావిస్తున్నారు. ప్రత్యర్థులను ఎదుర్కోవాలంటే లక్షల నుంచి కోట్ల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు తాముచేసిన సేవకు ప్రతిఫలంగా ఇప్పుడు ఆదుకోవాలని ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన నేతలను కూడా వారు కలుస్తున్నారు. జడ్పీటీసీకి రూ.4 లక్షలు, ఎంపీటీసీకి రూ.లక్షన్నర ఎన్నికల ఖర్చుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఎన్నికల సంఘం విధించిన వ్యయపరిమితికి ఎన్నో రెట్లు ఖర్చు పెడితే కానీ గెలువలేని పరిస్థితి ఉందని, అంత ఖర్చుపెట్టడం తమ వల్లకాదని పెద్ద నేతలకు ఆశావహులు మొరపెట్టుకుంటున్నారు. తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.

ఎటూ తేల్చుకోలేక..
డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిగెలిచినవారికి, ఓడిపోయినవారికి ఇప్పుడు సంకటపరిస్థితి ఎదురవుతోంది. తమ కోసం పనిచేసిన స్థానిక నేతలకు పరిషత్ ఎన్నికల్లో ఆర్థిక సాయం చేయకపోతే మున్ముందు ఇబ్బందులు తప్పవనివారు భావిస్తున్నారు. అలా అని చేద్దామంటే చేతిలో డబ్బులు లేక తలపట్టుకుంటున్నారు. వరుస ఎన్నికల వల్ల ఆస్తులు అమ్మి, అప్పులు తెచ్చి ఖర్చుపెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు కొందరైతే.. ఓడిపోయిన వాళ్లు ఇంకొందరు. గెలిచిన వాళ్ల పరిస్థితి అంతో ఇంతో మెరుగ్గా ఉన్నా.. ఓడినవాళ్ల పరిస్థితిమాత్రం దారుణంగా తయారైంది.