ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ దూకుడు పెంచింది. కుంభకోణానికి సంబంధించి ఇవాళ మరొకరిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్ కు చెందిన బోయినపల్లి అభిషేక్ రావును సీబీఐ అరెస్ట్ చేశారు. అతని నుంచి పలు కీలక డాక్యుమెంట్స్ సేకరించింది. హైదరాబాద్ నుంచి తొలి అరెస్ట్ కావడంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న విజయ్ నాయర్, ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అవకతవకలు, ముడుపులు ముట్టజెప్పిన ఆరోపణల నేపథ్యంలో సీబీఐ, ఈడీ అధికారులు ఇప్పటికే హైదరాబాద్ పలు దఫాలుగా దాడులు నిర్వహించారు. సోదాలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నాయి.
సీబీఐ అరెస్ట్ చేసిన అభిషేక్ రావు అనూస్ బ్యూటీ పార్లర్, రాబిన్ డిస్టిలరీస్‌కు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అనూస్ బ్యూటీపార్లర్‌లోనే డిస్టిలరీస్ ఏర్పాటు చేసి కార్యకలాపాలు నడిపిస్తున్నట్లు సీబీఐ గుర్తించింది. హైదరాబాద్‌కి చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి రామచంద్రన్ పిళ్లైతో కలిసి ఆయన వ్యాపారం చేస్తున్నట్లు విచారణలో తేలింది. 9 కంపెనీల్లో అభిషేక్ రావు డైరెక్టర్‌గా ఉన్నట్లు సీబీఐ గుర్తించింది. మరో వైపు అభిషేక్ రావు అరెస్ట్ పై బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
