
- హోటల్ యజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటుండగా అరెస్ట్
- కోర్టులో హాజరుపరిచిన అధికారులు.. 3 చోట్ల సోదాలు
యాదాద్రి, వెలుగు: ఓ హోటల్ యజమాని నుంచి రూ.60 వేలు లంచం తీసుకుంటూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) వరంగల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గాప్రసాద్ సీబీఐకి చిక్కారు. ఇటీవల యాదాద్రి జిల్లాలో పర్యటించిన దుర్గా ప్రసాద్.. గూడూరు టోల్‌ప్లాజాను సందర్శించారు. అదే సమయంలో టోల్‌ప్లాజా సమీపంలో రెస్టారెంట్నడిపే విషయంతోపాటు హోర్డింగ్స్ ఏర్పాటు కోసం ఓ హోటల్యజమాని నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు.
తాను డైరెక్టర్‌గా ఐదేండ్లు కొనసాగుతానని, అన్ని రోజులు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకుంటానని చెప్పడంతో హోటల్ యజమాని రూ.60 వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే ప్రాజెక్ట్ డైరెక్టర్డబ్బు డిమాండ్ చేసిన విషయంపై సీబీఐకి ఫిర్యాదు అందింది. దీంతో అబ్జర్వేషన్లో పెట్టిన సీబీఐ అధికారులు.. ఈ నెల 19న మంగళవారం హోటల్ యజమాని నుంచి దుర్గాప్రసాద్రూ.60 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరిచినట్టు సీబీఐ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. హైదరాబాద్, వరంగల్, సదాశివపేటలోని ఆఫీసుల్లో దాడులు నిర్వహించి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సీబీఐ తెలిపింది. దుర్గాప్రసాద్‌ను అరెస్టు చేసిన అనంతరం సీబీఐ అధికారులు గూడూరు టోల్ ప్లాజాకు వచ్చి ఆ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, కొనసాగుతున్న రెస్టారెంట్లను పరిశీలించినట్టు తెలిసింది.