న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై నమోదైన కేసు గురించి అమెరికా నుంచి భారత్‌కు ఎలాంటి సమాచారమూ అందలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వివరణ ఇచ్చింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీకి, ఇతరులకు సమన్లు వచ్చాయన్న రిపోర్ట్‌లను తోసిపుచ్చింది. ‘‘ఇది ప్రైవేట్ సంస్థలకు, వ్యక్తులకు... యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌తో ముడిపడి ఉన్న చట్టపరమైన విషయం. ఇటువంటి వాటిని పరిష్కరించడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయి. వాటి ప్రకారమే అంతా జరుగుతుంది.
ఈ అంశం గురించి అక్కడి ప్రభుత్వంతోనూ మేం మాట్లాడలేదు’’ అని ఎంఈఏ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో శుక్రవారం విలేకరులతో అన్నారు. సమన్లు లేదా అరెస్ట్ వారెంట్ల కోసం విదేశీ ప్రభుత్వం నుంచి అభ్యర్థన వస్తే మెరిట్స్ ఆధారంగా నిర్ణయం ఉంటుందని వివరణ ఇచ్చారు. యుఎస్ నుంచి ఈ కేసుపై ఎటువంటి అభ్యర్థనా రాలేదని స్పష్టం చేశారు.
ఈ కేసు వ్యక్తి, ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన విషయమని, భారత ప్రభుత్వం ఏ విధంగానూ దానిలో భాగం కాదని జైస్వాల్ వివరించారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వినీత్ జైన్‌పై అమెరికా న్యాయ శాఖ లంచం అభియోగాలు మోపలేదని అదానీ గ్రూప్ వివరణ ఇచ్చింది.