- ఢిల్లీ హైకోర్టు ముందు సీబీఐ వాదనలు
- కౌంటర్ దాఖలుకు ప్రతివాదులకు మూడు వారాల గడువు
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు ఒక్క నిమిషం కూడా రికార్డుల్లో ఉండడానికి వీల్లేదని సీబీఐ అభ్యంతరం తెలిపింది. ఈ కేసులో నిందితులందరికీ క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు, ఐఓపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడం వ్యవస్థకే విరుద్ధమని వాదనలు వినిపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సీబీఐ కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందికి రౌస్ ఎవెన్యూ కోర్టు (సీబీఐ స్పెషల్ కోర్టు) స్పెషల్ జడ్జ్ జితేంద్ర సింగ్ గత నెల 27న క్లీన్ చిట్ ఇచ్చారు.
ఈ తీర్పును సవాలు చేస్తూ ఈనెల 1న సీబీఐ 974 పేజీలతో ఢిల్లీ హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను సోమవారం మరోసారి జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కేజ్రీవాల్ తరపున సీనియర్ అడ్వొకేట్ ఎన్.హరిహరన్, ఇతరుల తరపున పలువురు అడ్వొకేట్లు హాజరయ్యారు. జస్టిస్ స్వర్ణకాంత శర్మ జోక్యం చేసుకొంటూ ఈ కేసులో సీబీఐ పిటిషన్ పై సమాధానం ఇచ్చేందుకు సమయం కోరుతున్నారా? అని ప్రశ్నించారు.
ఇందుకు కేజ్రీవాల్ తరపు న్యాయవాది స్పందిస్తూ... సీబీఐ అధికారి (ఐఓ) పై ట్రయల్ కోర్టు వ్యాఖ్యలను నిలిపివేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ దాఖలు చేశారని నివేదించారు. అలాగే ఈ కేసు విచారణను ఇతర బెంచ్ కి బదిలీ చేయాలన్న తమ విజ్ఞప్తిని... హైకోర్టు తిరస్కరించడంపైనా సుప్రీంలో రిట్ పిటిషన్ వేశారని వెల్లడించారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్ర అభ్యంతరం తెలిపారు. వాదనలు విన్న బెంచ్.. సమాధానం ఇచ్చేందుకు సమయం కావాలన్న ఇతర ప్రతివాదుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.
