- రంగంలోకి దిగిన సీబీఐ
- వర్క్‌మెన్ల పేరిట నకిలీ రికార్డులు సృష్టించిన అధికారులు
- వేతనాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ క్లెయిమ్ చేసుకున్న కాంట్రాక్ట్ సంస్థ
- రైల్వే ఉద్యోగులుసహా 11 మందిపై రెండు ఎఫ్‌ఐఆర్‌లు
హైదరాబాద్, వెలుగు: కాజీపేట సెంట్రల్ రైల్వే ట్రాక్స్ మెయింటెనెన్స్‌లో భారీ అవినీతి జరిగింది. కాజీపేట, పొటకపల్లి, ఉప్పల్ రైల్వేస్టేషన్ల పరిధిలో సేఫ్టీ ట్రాక్ మెయింటెనెన్స్ పనుల్లో రైల్వే నిధులు గోల్‌మాల్ అయ్యాయి. నకిలీ మెయింటెనెన్స్ వర్కర్లు, చేయని పనులకు వేతనాలు, వర్క్‌మెన్ల పేరిట నకిలీ రికార్డులు, ఈపీఎఫ్‌వో, ఈఎస్‌ఐల రూపంలో జరిపిన క్లెయిమ్స్‌కు సంబంధించి సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది.
ఈ మేరకు ఏడుగురు రైల్వే సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు, కాంట్రాక్ట్ సంస్థ సంధ్య కన్‌స్ట్రక్షన్స్ సహా మొత్తం 11 మందిపై రెండు కేసులను నమోదు చేసింది. రైల్వే అధికారులు, కాంట్రాక్టు సంస్థపై వేర్వేరుగా ఎఫ్‌ఐఆర్‌లు రిజిస్టర్ చేసింది. దర్యాప్తులలో భాగంగా తనిఖీలు నిర్వహించింది.
కాజీపేట నార్త్ రైల్వే ట్రాక్ సంరక్షణ పనుల్లో అవినీతి, కుట్ర, మోసం జరిగినట్టు గుర్తించింది. 2022 నుంచి 2024 మధ్య కాలంలో ట్రాక్ భద్రతా పనుల కాంట్రాక్ట్ ఒప్పందం కింద పనులు చేపట్టిన సంధ్య కన్‌స్ట్రక్షన్స్ సంస్థ, సంబంధిత రైల్వే అధికారులతో కలిసి మోసానికి పాల్పడినట్టు ఆధారాలు సేకరించింది. మరో కేసులో 2022 నుంచి 2024 మధ్య కాలంలో కాజీపేట, పొటకపల్లి, ఉప్పల్ రైల్వే స్టేషన్ల పరిధిలో భద్రతా ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కోసం కుదిరిన కాంట్రాక్ట్‌లోనూ సంధ్య కన్‌స్ట్రక్షన్స్ సంస్థ, సంబంధిత రైల్వే అధికారితో కలిసి రైల్వేలకు నష్టం కలిగించినట్లు గుర్తించింది.
కాంట్రాక్ట్ సంస్థతో రైల్వే అధికారులు కుమ్మక్కు
ఈ రెండు కేసులలో సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (కాజీపేట నార్త్) గ్యానేంద్ర ప్రతాప్ సింగ్, సంధ్య కన్‌స్ట్రక్షన్స్ మేనేజింగ్ పార్టనర్ రాజేశం గుడ్ల, ఖాజీపేట సెంట్రల్ సీనియర్ సెక్షన్ ఇంజినీర్లు గోపి, భూపేశ్ గుప్త, చక్రధర్, ట్రాక్ మెయింటెయినర్లు రవి, అరుణ్‌కుమార్, సంధ్య కన్‌స్ట్రక‌్షన్స్ సంస్థతోపాటు, ఆ సంస్థ మేనేజర్ అరుణ్‌కుమార్, ఇతర తెలియని వ్యక్తులను నిందితులుగా చేర్చారు. నకిలీ ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐ రికార్డులు, కల్పిత వేతన చెల్లింపు లేఖలు, నకిలీ లేదా కొత్త రోల్‌లను సమర్పించడం ద్వారా రైల్వేలు మోసం చేసినట్టు సీబీఐ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది.
జీతం చెల్లింపు కోసం అందించిన ఏ బ్యాంకు ఖాతా నంబర్లు వాస్తవంగా లేవని.. అనేక ఈపీఎఫ్‌వో రసీదులు నకిలీవని విచారణలో తేలింది. కాంట్రాక్టర్ నుంచి కొందరు అధికారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ చర్యల వల్ల రైల్వే ఖజానాకు ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.
