Delhi liquor case: రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ

Delhi liquor case: రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేసిన సీబీఐ

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దిగువ కోర్టు ఉత్తర్వులను నిలిపివేయాలని కోరింది. ఈ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

అసలేం జరిగిందంటే..?

దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో శుక్రవారం (ఫిబ్రవరి 27) రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ ఎమ్మెల్సీ కవిత సహా 23 మందికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. నిందితులపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని పేర్కొంటూ సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసింది.

ఈ సందర్భంగా సీబీఐపై న్యాయస్థానం మండిపడింది. సీబీఐ కేసు నమోదు చేసిన తీరు, దర్యాప్తు విధానాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. సీబీఐ ముందస్తు స్క్రిప్ట్ ప్రకారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధం లేని వ్యక్తులను నిందితులుగా చేర్చారని మండిపడింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు విచారణ నిష్పక్షపాతం జరగలేదని.. నిందితులపై మోపిన అభియోగాలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంటూ సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసింది.

 కోర్టు తీర్పుపై కేజ్రీవాల్, సిసోడియా, కవిత హర్షం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కుట్రలో భాగంగా పెట్టిన అక్రమ కేసు అని.. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులుగా వాడుకుంటుందని ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ, అమిత్ షా క్షమాపణ చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.