బుచ్చిబాబు వాంగ్మూలంతో తెరపైకి కవిత పేరు

బుచ్చిబాబు వాంగ్మూలంతో తెరపైకి కవిత పేరు

లిక్కర్​ స్కామ్​లో కవిత మాజీ సీఏ గోరంట్ల బుచ్చిబాబు విచారణతో కవిత పేరు తెరపైకి వచ్చిందని సీబీఐ తెలిపింది. బుచ్చిబాబు మొబైల్ ఫోన్లలో లభించిన వాట్సప్ చాటింగ్స్, ఎవిడెన్స్​లతో పాటు అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలంతో కవిత పాత్ర తేలిందని పేర్కొంది. హవాలా రూపంలో డబ్బు మళ్లించినట్లు పలు పత్రాలు దొరికాయని కోర్టు దృష్టికి తెచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్, ఇతర నిందితుల ద్వారా రూ.100 కోట్లు మళ్లించడం, ఆ డబ్బును ఇతరుల నుంచి కవిత వసూలు చేయడం వంటివి బయటపడ్డాయని పేర్కొంది. కవితకు ఇండో స్పిరిట్ హోల్ సేల్ లైసెన్స్​లో భాగస్వామ్యం ఉందని, ఇందులో ఆమె బినామీగా అరుణ్ పిళ్లై వ్యవహరించారని.. బుచ్చిబాబు, కవితకు మధ్య జరిగిన ఫోన్ కాల్ ద్వారా ఈ విషయం బహిర్గతమైందని సీబీఐ వివరించింది. 

ఎయిర్ పోర్ట్ జోన్​లో మాగుంట రాఘవ కంపెనీ ‘పిక్సీ ఎంటర్ ప్రైజెస్’కు  ఎన్​వోసీ వచ్చేందుకు కవిత సహాయపడ్డారని వెల్లడించింది. 2021 సెప్టెంబర్ 20న ఢిల్లీలోని హోటల్ తాజ్ మాన్ సింగ్​లో ఫెర్నార్డ్ రికార్డు ఇండియా నిర్వహించిన మీటింగ్​లో అరబిందో గ్రూప్​కు చెందిన శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, సమీర్ మహేంద్ర, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్​పల్లి పాల్గొన్నారని.. ఈ మీటింగ్ కు సంబంధించిన ఫొటోలు ఫెర్నార్డ్ రికార్డు సంస్థకు చెందిన మనోజ్ రాజ్ మొబైల్ ఫోన్​లో లభించాయని కోర్టుకు సీబీఐ ఆధారాలు సమర్పించింది. కాగా..  2022 డిసెంబర్ 11న హైదరాబాద్ లో కవితను తాము విచారించామని, అయితే అప్పటికి మాగుంట రాఘవ, ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులురెడ్డి, శరత్ చంద్రారెడ్డి స్టేట్​మెంట్లను రికార్డు చేయలేదని తెలిపింది. వీరి స్టేట్​మెంట్ల తర్వాతే కవిత పాత్ర స్పష్టంగా తేలిందని సీబీఐ వెల్లడించింది.